పేపర్ లీకేజీ కేసులో కీలక పాత్ర రాజేశ్వర్ దే!
- ఏఈ పేపర్ అమ్మకానికి రూ.40 లక్షలు
- అడ్వాన్స్ గా రూ.23 లక్షలు తీసుకుని ఒప్పందం
- నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి
- ఈ నెల 11 న కోర్టుకు రిపోర్టును అందజేయనున్న సిట్ బృందం
ప్రవీణ్ నుంచి రేణుకకు పేపర్..
టీఎస్పీఎస్సీ ఆఫీసులోని కాన్ఫిడెన్షియల్ రూమ్ లో నుంచి ఏఈ పేపర్ ను ప్రవీణ్ కుమార్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. పెన్ డ్రైవ్ లో కాపీ చేసి బయటకు తీసుకొచ్చాడు. ఆ పేపర్ ను అమ్మేందుకు రూ.10 లక్షలకు రేణుకతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ గా రూ. 5 లక్షలు తీసుకున్నాడు. రేణుక తన భర్త డాక్యా నాయక్ తో కలిసి సమీప బంధువు రాజేశ్వర్ తో పేపర్ అమ్మకానికి సంబంధించి మాట్లాడింది. రాజేశ్వర్ మధ్యవర్తులు గోపాల్, నీలేశ్, ప్రశాంత్, రాజేంద్రలకు ఏఈ పేపర్ ను రూ.40 లక్షలకు విక్రయించాడు. అడ్వాన్స్ గా అందిన రూ.23 లక్షల్లో రూ.10 లక్షలను రేణుకకు అందించాడు.
ఉద్యోగుల విచారణ..
ఈ కేసులో ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఉద్యోగులు పలువురిని సిట్ అధికారులు విచారించారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని పది దఫాలుగా సుమారు 20 గంటల పాటు ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల భద్రత, యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లను ప్రవీణ్ ఎలా తెలుసుకున్నాడనే వివరాలను సేకరించారు. ఆపై టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితారామచంద్రన్ ను కూడా విచారించారు. తాజాగా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని వివరణ కోరేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 11న తన రిపోర్టును కోర్టుకు అందజేయాల్సి ఉండడంతో సిట్ బృందం విచారణలో వేగం పెంచింది.