Balagam Movie: దుమ్మురేపుతున్న 'బలగం' సినిమా... మరో అంతర్జాతీయ అవార్డు కైవసం

  • రూ. 2 కోట్లతో తెరకెక్కి ఇప్పటి వరకు రూ. 25 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన 'బలగం'
  • అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న చిత్రం
  • తాజాగా ఉక్రెయిన్ కు చెందిన మరో అవార్డును కైవసం చేసుకున్న వైనం 
One more international award to Balagam movie

ఇప్పుడు సినీ అభిమానులందరూ 'బలగం' గురించే మాట్లాడుకుంటున్నారు. కేవలం రూ. 2 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఎవరూ ఊహించని స్థాయిలో ఇప్పటి వరకు రూ. 25 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి సంచలన విజయాన్ని నమోదు చేసింది. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రం బలగం. తెలంగాణ సంస్కృతిని, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాలను వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పల్లెటూరి ప్రజలను ఎంతగానో మెప్పించిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదలై అక్కడా ఎంతో ఆదరణ దక్కించుకుంది.

ఈ సినిమా అంతర్జాతీయ వేదికలపై కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే లాస్ ఏంజెలెస్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా మరో అంతర్జాతీయ అవార్డు ఈ చిత్రాన్ని వరించింది. బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఒనికో ఫిల్మ్ అవార్డ్ (ఉక్రెయిన్) ను సొంతం చేసుకుంది. మరో అంతర్జాతీయ అవార్డు రావడంతో చిత్ర బృదం సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రేక్షకుల వల్లే ఇది సాధ్యమయిందని ట్వీట్ చేసింది. 

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించారు. మరోవైపు ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వేణుకు దర్శకుడిగా అవకాశాలు వస్తున్నాయి. వేణు తదుపరి సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ పైనే తెరకెక్కబోతున్నట్టు సమాచారం. అంతేకాదు, వేణుకు గీతా ఆర్ట్స్ నుంచి కూడా ఆఫర్ వచ్చినట్టు చెపుతున్నారు.

More Telugu News