Raja Singh: నా కుమారుడ్ని కిడ్నాప్ చేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: రాజా సింగ్

  • ఇటీవల శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదం
  • రాజాసింగ్ పై కేసులు నమోదు
  • ధర్మం గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారన్న రాజాసింగ్
  • రెండ్రోజులుగా బెదరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడి
  • పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపణ
Raja Singh said he receives threat calls

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాదులో శోభాయాత్ర నిర్వహించడం తెలిసిందే. ఈ సందర్భంగా తన కుమారుడ్ని పరిచయం చేస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ఇప్పటికే ఆఫ్జల్ గంజ్ పోలీసులు, షాహినాయత్ గంజ్ పోలీసులు రాజాసింగ్ పై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలో రాజాసింగ్ స్పందించారు. 

శోభాయాత్రలో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ధర్మం గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అసలు భారత్ లో ఉందా, లేక పాకిస్థాన్ లో ఉందా అనే సందేహం కలుగుతోందని అన్నారు. మన హిందూదేశంలో ధర్మం గురించి మాట్లాడొద్దంటూ కేసులు పెడుతున్నారని ఆక్రోశించారు. తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు. 

అంతేకాకుండా, గత రెండ్రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజా సింగ్ వెల్లడించారు. తన కుమారుడ్ని కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ అయినా నమోదు చేశారా అని పోలీసులను ప్రశ్నించారు.

More Telugu News