ఐపీఎల్ 2023: తిప్పేసిన మార్క్‌వుడ్.. లక్నో ఘన విజయం

  • ఐదు వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన మార్క్ వుడ్
  • 194 పరుగుల లక్ష్య ఛేదనలో 143 పరుగులు మాత్రమే చేయగలిగిన ఢిల్లీ
  • 38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 73 పరుగులు చేసిన మేయర్స్
Mark Wood 5 wicket haul collapses Delhi Batting order

ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పాయి ఏక్నా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం 194 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. లక్నో బౌలర్ మార్క్ వుడ్ బంతితో నిప్పులు చెరగడంతో ఢిల్లీ బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలు చేశాడు. 

కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసిన 56 పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. రిలీ రోసౌ 30 పరుగులు, అక్షర్ పటేల్ 16 పరుగులు చేశారు. పృథ్వీషా 12 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. ఫలితంగా భారీ తేడాతో ఓటమి పాలైంది. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్ 5 వికెట్లు తీసుకోగా, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. కైల్ మేయర్స్ ఊచకోతతో భారీ స్కోరు సాధించింది. 38 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మేయర్స్ 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 73 పరుగులు సాధించాడు. చివర్లో నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ చెలరేగడంతో జట్టు స్కోరు అమాంతం పెరిగింది. పూరన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేయగా, ఆయుష్ బదోని 7 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 18 పరుగులు చేశాడు. 

ఇన్నింగ్స్ చివరి బంతిని కృష్ణప్ప గౌతమ్ సిక్సర్‌గా మలచడంతో స్కోరు 190 పరుగులు దాటింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఐదు వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించిన లక్నో బౌలర్ మార్క్ వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్‌లో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ మధ్య బెంగళూరులో మ్యాచ్‌లు జరుగుతాయి.

More Telugu News