చాట్ జీపీటీని నిషేధించిన ఇటలీ

  • టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న చాట్ జీపీటీ
  • కృత్రిమ మేధ సాయంతో అద్భుత సృష్టి
  • అయితే చాట్ జీపీటీపై పలు దేశాల సందేహం
  • ఇప్పటికే నిషేధించిన రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్
  • అదే బాటలో ఇటలీ
Italy bans ChatGPT

ఏఐ సాంకేతికత ఆధారంగా రూపుదిద్దుకున్న చాట్ జీపీటీ ప్రపంచ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏదైనా అంశం ప్రస్తావించినప్పుడు అందుబాటులో ఉన్న సంపూర్ణ సమాచారాన్ని విశ్లేషించి, పరిష్కారం చూపడం చాట్ జీపీటీ ప్రత్యేకత. 

చరిత్ర, కవితలు, కళలు, సాహిత్యం, రచనలు, వైద్య రంగం, రక్షణ రంగం, అంతరిక్షం, వ్యవసాయం, విద్య, పరీక్షలు, క్రీడలు... ఇలా ఏ రంగానికి చెందిన సమాచారం కావాలన్నా, సలహా కావాలన్నా చాట్ జీపీటీ వెంటనే అందిస్తుంది. చాట్ జీపీటీని కలిగి ఉంటే ఓ అపర మేధావి మన పక్కన ఉన్నట్టే!

అయితే, అనేక దేశాలు ఆ చాట్ బాట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చాట్ జీపీటీని రష్యా, ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ నిషేధించగా... ఇప్పుడా దేశాల బాటలో ఇటలీ కూడా నడిచింది. చాట్ జీపీటీని నిషేధిస్తున్నట్టు ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఓ ప్రకటన చేసింది. డేటా నియమాల ఉల్లంఘన కేసు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇటలీ భద్రతా నిబంధనలకు ఇది లోబడి ఉందా? లేదా? అనే అంశం పరిశీలిస్తామని వెల్లడించింది.

More Telugu News