Chandrababu: పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి వాహనంపై దాడి... ఖండించిన చంద్రబాబు

Chandrababu condemns attack on Palle Raghunatha Reddy vehicle
  • పుట్టపర్తిలో సవాళ్ల పర్వం
  • సవాల్ చేసుకున్న మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి 
  • ఇద్దరినీ గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • గోడ దూకి వెళ్లిన రఘునాథరెడ్డి
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై పరస్పరం సవాళ్లు విసురుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 

ఇటీవల పుట్టపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ టీడీపీ హయాంలోనే పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని, వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతిపరుడు అని తీవ్ర విమర్శలు చేశారు. లోకేశ్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై ధ్వజమెత్తారు. 

ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి కూడా అదే స్థాయిలో స్పందించారు. పుట్టపర్తి సత్తెమ్మ ఆలయంలో ఎవరి నిజాయతీ ఎంతో ప్రమాణం చేసుకుందాం అంటూ ఇరువురు సవాళ్లు విసురుకున్నారు. అయితే పోలీసులు ఇద్దరినీ గృహ నిర్బంధం చేశారు. 

టీడీపీ కార్యాలయంలో హౌస్ అరెస్ట్ కు గురైన పల్లె రఘునాథరెడ్డి గోడ దూకి పుట్టపర్తి హనుమాన్ జంక్షన్ వెళ్లారు. అక్కడ ఆయన కారుపై దాడి జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. పల్లె రఘునాథరెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ్నించి తరలించారు. 

ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వాహనంపైనా, టీడీపీ కార్యకర్తలపైనా వైసీపీ రౌడీలు దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతి రోజు దాడులు సమాధానం కాలేవు అని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
Chandrababu
Palle Raghunatha Reddy
Duddukunta Sridhar Reddy
Puttaparthi
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News