Airlines company: పక్కసీటు వ్యక్తి లావుగా ఉన్నాడని ఫిర్యాదు చేస్తే షాకిచ్చిన ఎయిర్ లైన్స్ సంస్థ

Teenager Gets Banned For Complaining About Obese Next Seat Passenger
  • ఫిర్యాదు చేసిన యువకుడిపై బ్యాన్ విధించిన వైనం 
  • అమర్యాదకరంగా ప్రవర్తించాడంటూ ఆరోపించిన ఎయిర్ లైన్స్ సంస్థ
  • తన సీటును కూడా ఆక్రమించుకోవడంతో ఇబ్బంది పడ్డానన్న యువకుడు
  • 12 గంటలపాటు అసౌకర్యంగా ప్రయాణించేదెలా అని నిలదీసినట్లు వెల్లడి
  • సోషల్ మీడియా రెడ్డిట్ లో పంచుకున్నఅమెరికన్ టీనేజర్
పక్క సీటులో కూర్చున్న ప్రయాణికుడు లావుగా ఉన్నాడని, తన సీటును కూడా ఆక్రమించుకున్నాడని ఫిర్యాదు చేసిన యువకుడికి ఎయిర్ లైన్స్ సంస్థ షాక్ ఇచ్చింది. తోటి ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందితో అమర్యాదకరంగా మాట్లాడాడని ఆరోపిస్తూ తాత్కాలిక బ్యాన్ విధించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సదరు యువకుడు సోషల్ మీడియా రెడ్డిట్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అమెరికాలోని ప్రముఖ సోషల్ మీడియా రెడ్డిట్ లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం..

ఓ ప్రముఖ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు తన పక్క సీటులోని ప్రయాణికుడిపై సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. పక్క సీటులోని ప్రయాణికుడు లావుగా ఉన్నాడని, తన సీటులో కొంతభాగాన్ని ఆక్రమించుకున్నాడని ఆరోపించాడు. దీనివల్ల తాను సరిగా కూర్చోలేకపోతున్నానని చెప్పాడు. ఇలా ఇబ్బంది పడుతూ 12 గంటలు ఎలా ప్రయాణించగలనని ప్రశ్నించాడు. అయితే, తనలాగే ఆ లావుపాటి వ్యక్తి కూడా టికెట్ కొనుగోలు చేసి ప్రయాణిస్తున్నాడని ఫ్లైట్ అటెండెంట్ చెప్పిందన్నాడు. ఫ్లైట్ మొత్తం నిండిపోవడంతో వేరే సీట్ లోకి మార్చే అవకాశం కూడా లేదని వివరించిందన్నాడు.

దీనిపై కొద్దిపాటి చర్చ జరిగిన తర్వాత ఫ్లైట్ అటెండెంట్ తననే తప్పుబట్టారని ఆ కుర్రాడు వాపోయాడు. సిబ్బంది ఫిర్యాదుతో సదరు ఎయిర్ లైన్స్ కంపెనీలో ప్రయాణించకుండా తనపై తాత్కాలిక బ్యాన్ విధించారని చెప్పాడు. అయితే, సదరు ఎయిర్ లైన్స్ సంస్థ పంపించిన ఫిర్యాదు నోటీసులపై వివరణ ఇవ్వడంతో బ్యాన్ ను వెంటనే ఎత్తేశారని వివరించాడు. ఈ విషయాన్ని ఆ యువకుడు రెడ్డిట్ లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు యువకుడిదే తప్పని కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం మద్దతు తెలుపుతూ కామెంట్లు పెట్టారు.
Airlines company
american airlines
reddit
american teenager
ban

More Telugu News