పెట్రోలు బాటిల్‌తో కౌన్సిల్ సమావేశానికి.. తన వార్డులో అభివృద్ధి లేనందుకు ఆత్మహత్య చేసుకుంటానన్న జంగారెడ్డిగూడెం కౌన్సిలర్!

  • అన్ని వార్డుల్లోనూ అభివృద్ది జరుగుతున్నా తన వార్డులో జరగడం లేదని ఆవేదన
  • పెట్రోలు బాటిల్‌తో కౌన్సిల్ సమావేశానికి
  • వచ్చే సమావేశం నాటికి పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన చైర్ పర్సన్
YCP Counseller Threatens to commit suicide in Jangareddigudem

తన వార్డులో ఇసుమంతైనా అభివృద్ధి జరగనందుకు పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వైసీపీ కౌన్సిలర్.. సమావేశంలో హల్‌చల్ చేశారు. ఆయన చేతిలో ఉన్న పెట్రోలు బాటిల్‌ను మరో కౌన్సిలర్ లాగేసుకోవడంతో ప్రమాదం తప్పింది. పూర్తివివరాల్లోకి వెళ్తే.. నిన్న జంగారెడ్డిగూడెం పురపాలక సమావేశం నిర్వహించారు. చైర్ పర్సన్ బత్తిన లక్ష్మి అధ్యక్షత వహించిన ఈ సమావేశం చివరలో కౌన్సిలర్ సురేష్ మాట్లాడుతూ.. అన్ని వార్డుల్లోనూ అభివృద్ధి పనులు జరుగుతున్నా, తన వార్డులో మాత్రం ఇసుమంతైనా పని జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కౌన్సిల్ తీర్మానం జరిగి ఏడాది దాటినా పనులు ప్రారంభించలేదని చెబుతూ వెంట తెచ్చుకున్న పెట్రోలు బాటిల్‌ బయటకు తీశారు. అభివృద్ధి జరగనందుకు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో సమావేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, పక్కనే ఉన్న మరో కౌన్సిలర్ వెంటనే అప్రమత్తమై ఆ బాటిల్‌ను లాగేసుకున్నారు. సురేష్ ఆవేదనను అర్థం చేసుకున్న చైర్ పర్సన్ లక్ష్మి వచ్చే సమావేశం నాటికి ఆయన వార్డులో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి సమావేశాన్ని ముగించారు.

More Telugu News