Nara Lokesh: ​జగన్ పనైపోయిందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు: లోకేశ్​​​​

  • రాప్తాడు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • నేడు యువగళం పాదయాత్రకు 56వ రోజు
  • పైదిండి వద్ద బహిరంగ సభ
  • వైసీపీ నేతలపై లోకేశ్ విమర్శనాస్త్రాలు
Lokesh take swipe at YS Jagan in Yuvagalam padayatra

కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ యాత్ర అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. యువగళం పాదయాత్ర 56వరోజు (శుక్రవారం) రాప్తాడు నియోజకవర్గం సీకే పల్లి పంచాయితీ కోన క్రాస్ వద్ద నుంచి ప్రారంభమైంది. పైదిండి వద్ద నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ, సింగడు అద్దంకి వెళ్ళాడు... వచ్చాడు అన్నట్టు ఉంది జగన్ ఢిల్లీ యాత్ర అని ఎద్దేవా చేశారు. "జగన్ ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయలేదు. రాజ్యసభ, లోక్ సభలో కలిపి 31 మంది ఎంపీలు ఉన్నారు. కేసుల కోసం తప్ప ప్రత్యేక హోదా గురించి జగన్, ఆయన ఎంపీలు ఏ రోజూ పోరాడలేదు రాష్ట్ర ప్రయోజనాలు నిల్లు. సొంత ప్రయోజనాలు మాత్రం ఫుల్లు. 

నిన్నే చూసాం ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏం చేశారో. ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆయన ఏమాత్రం తగ్గలేదు... రోడ్డు మీద కుర్చీ వేసుకొని దమ్ముంటే రండి తేల్చుకుందాం అంటూ జగన్ కే సవాల్ విసిరారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు జగన్ పనైపోయింది అని చెప్పడానికి" అని లోకేశ్ స్పష్టం చేశారు.

లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...

  • జగన్ ది పరదాల యాత్ర... నాది ప్రజాయాత్ర!
  • యువగళం దెబ్బకు జగన్ వారానికోసారి ఢిల్లీ యాత్ర చేస్తున్నాడు
  • ఇచ్చిన హామీలపై జగన్ ను ప్రశ్నిస్తూనే ఉంటా!
  • జగన్ ది పరదాల యాత్ర... ఈ లోకేష్ ది ప్రజా యాత్ర... ఏ తప్పూ చెయ్యలేదు కాబట్టే నేను ధైర్యంగా కాలర్ ఎగరేసి తిరుగుతున్నాను. తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు కాబట్టే ముప్పై కిలోమీటర్ల ప్రయాణానికి కూడా జగన్ హెలీకాప్టర్ వాడుతున్నాడు.
  •  నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడు, సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు. ఇప్పుడు అయ్యా అందరూ విడివిడిగా పోటీచేయ్యండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చాడు. అది యూత్ పవర్. 
  • అధికార మదంతో మాట్లాడిన జగన్ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుండు కొట్టారు ప్రజలు. పాదయాత్ర అడ్డుకోవడానికి జగన్ పోలీసుల్ని పంపిన రోజే చెప్పా సాగనిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అని. 
  • నేను లక్ష కోట్లు ప్రజాధనం దొబ్బి జైలుకి వెళ్ళలేదు, బాబాయ్ ని చంపిన చరిత్ర నాకు లేదు. ఏం పీక్కుంటారో పీక్కోండి అని సవాల్ చేశాను
  • పాదయాత్రలో ఊరికో కేసు పెట్టుకున్నారు అంతకు మించి పీకింది ఏమి లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ గళం ఆగదు... ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటా. జగన్ పాదయాత్రలో ముద్దులు పెట్టి హామీలు గుప్పించి, ఇప్పుడు పారిపోతానంటే నేను ఊరుకుంటానా? ఇచ్చిన ప్రతి హామీ గుర్తుచేసి రోడ్డు మీద నిలబెడతా.

అవినీతిలో తోపులు... ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరులు!

రాప్తాడు ఎమ్మెల్యే పేరు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి... ఆయన అభివృద్ధిలో వీకు... అవినీతిలో తోపు అని లోకేశ్ అభివర్ణించారు. అందుకే ఆయనకు నేను ముద్దుగా దోపిడీదుర్తి ప్రకాష్ అని పేరు పెట్టా అని వెల్లడించారు. 

"ఏ నియోజకవర్గానికైనా ఒక్క ఎమ్మెల్యేనే ఉంటారు. కానీ రాప్తాడుకి మాత్రం ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దోపిడీదుర్తి ప్రకాశ్, ఆయన తండ్రి గారు, ఇద్దరు బ్రదర్స్, ఇంకో లేడీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. రాప్తాడు వీళ్లకి మంచి పేస్ట్రీ కేకులా దొరికింది. 5 ముక్కలుగా కోసుకొని తినేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో వీళ్ల అవినీతి సంపాదన ఎంతో తెలుసా? వెయ్యి కోట్లు. దోపిడీదుర్తి కుటుంబం అధికారంలోకి రాగానే కొంత మంది పోలీసుల్ని పార్ట్నర్స్ గా చేర్చుకొని రైతులను, రియల్ ఎస్టేట్ వారిని బెదిరించి వందల ఎకరాలు దోచేసారు. 

రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల్లో ఎక్కడ ఏ లేఔట్ వేయాలన్నా ఈ దోపిడీదుర్తి కుటుంబానికి కప్పం కట్టాల్సిందే. ఎకరానికి 10 లక్షలు వసూలు చేస్తున్నారు. విశాఖపట్నంలో కూడా ఈ కుటుంబం భూకబ్జాలు చేసింది" అని వివరించారు. 

రాక్రీట్ పేరుతో రూ.280 కోట్ల దోపిడీ!

దోపిడీదుర్తి కుటుంబానికి ఒక దోపిడీ కంపెనీ ఉందని, దాని పేరు రాక్రీట్ అని లోకేశ్ వెల్లడించారు. అనంతపురంలో 9 వేలు, గుంటూరు, కృష్ణాలో వేల ఇళ్లు నిర్మించే కాంట్రాక్ట్ తీసుకున్నారని తెలిపారు. 

"ఎన్నికల్లో సొంత ఇల్లు లేదు అని ఏడ్చిన వాళ్లకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? ఇళ్ళ నిర్మాణానికి పునాది వేస్తే 70 వేల రూపాయలు బిల్లు చెల్లిస్తారు. అయితే రాక్రిట్ సంస్థ 10 వేల రూపాయల్లో అత్యంత నాసిరకంగా పునాది నిర్మించి 70 వేల రూపాయలు బిల్లు తీసుకుంది. రాక్రీట్ సంస్థ నిర్మిస్తున్న ఇళ్లు చిన్నపిల్లాడు బలంగా తంతే పడిపోయేంత నాసిరకంగా ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇళ్ల నిర్మాణంలో దోపిడీదుర్తి కుటుంబం కొట్టేసిన సొమ్ము ఎంతో తెలుసా 280 కోట్లు. 

ఇక్కడ ఉన్న మహిళా ఎమ్మెల్యే గారి దోపిడి మరో రకం. తోపుదుర్తి సహకార డైరీ పేరుతో మహిళల నుండి డ్వాక్రా సొమ్ము 10 కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బుతో డైరీ ఏర్పాటు చేస్తూ సొంత సొమ్ముతో ప్రజల్ని ఉద్దరిస్తున్నట్టు చూపిస్తున్నారు. 

సునీతమ్మ హయాంలోనే రాప్తాడు అభివృద్ధి

అభివృద్ధిలో పరిటాల సునీతమ్మ స్పీడ్ అందుకోవడం ఎవరి వల్లా కాదు అని లోకేశ్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా సునీతమ్మ ప్రజలు, రైతులకు అండగా పోరాటం చేశారని కొనియాడారు. టీడీపీ హయాంలో రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం 5 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

ఇసుకే బంగారమాయెనే... బెంగళూరు పోయేనే!

సీకే పల్లి శివార్లలో చిత్రావతి నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను చూసిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇసుకే బంగారమాయెనే... బెంగళూరు పోయెనే అంటూ సినీ స్టయిల్లో వ్యాఖ్యానించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇసుక దందాకు ఇదే నిదర్శనం అని వెల్లడించారు. ఒకేసారి తొమ్మిది ఇసుక టిప్పర్లు ఎలాంటి పర్మిట్ లేకుండా ఇసుకను బెంగళూరు తరలిస్తున్నారని తెలిపారు. 

"పేరుకే జేపీ కంపెనీకి కాంట్రాక్ట్... కానీ చిత్రావతిలో ఆధిపత్యం మొత్తం కేతిరెడ్డిదే. నలుగురు అనుచరులను బినామీలుగా పెట్టుకుని ఇసుకను దోచుకుంటున్నారు" అంటూ లోకేశ్ వివరించారు. 


*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 719.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 12.2 కి.మీ.*

*57వరోజు (1-4-2023) యువగళం పాదయాత్ర వివరాలు:*

*ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం*

ఉదయం

11.00 – పైదిండి క్యాంప్ సైట్ లో పట్టు కార్మికులు, వ్యాపారులతో ముఖాముఖి.

మధ్యాహ్నం 

12.00 – పైదిండి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

12.30 – పైదిండిలో స్థానికులతో మాటామంతీ.

1.20 – నామాల క్రాస్ వద్ద ఆత్మకూరు డైలీ వేజ్ కార్మికులతో భేటీ.

1.45 – పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలోకి ప్రవేశం.

2.20 – ధర్మవరం 28వ వార్డులో టిడ్కో గృహాల బాధితులతో సమావేశం.

సాయంత్రం

3.00 – ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో చేనేత కార్మికులతో భేటీ.

3.40 – ధర్మవరం యర్రగుంటలో పోతులనాగపల్లి స్థానికులతో మాటామంతీ.

4.35 – ధర్మవరం పార్థసారధినగర్ లో భోజన విరామం.

5.30 – ధర్మవరం పార్థసారధినగర్ నుంచి పాదయాత్ర కొనసాగింపు.

5.50 – ధర్మవరం ఆర్టీసీ బస్టాండు వద్ద బలిజ సామాజికవర్గీయులతో సమావేశం.

6.20 – ధర్మవరం మదీనా మసీదులో ప్రార్థనలు, ముస్లిం పెద్దలతో భేటీ.

7.00 – ధర్మవరం అంజుమన్ సర్కిల్లో స్వర్ణకారులతో సమావేశం.

7.40 – ధర్మవరం కన్యాకాపరమేశ్వరి గుడి సమీపంలో ఆర్యవైశ్యులతో భేటీ.

8.30 – ధర్మవరం సిఎన్ బి గ్రాండ్ వద్ద విడిది కేంద్రంలో బస.

More Telugu News