కామెంటరీలో మొదట ఇబ్బందిపడినా... ఆ తర్వాత పికప్ అయిన బాలయ్య

  • ఐపీఎల్ కామెంటేటర్ అవతారం ఎత్తిన బాలకృష్ణ
  • ఐపీఎల్-16 తొలి మ్యాచ్ కు కామెంట్రీ బాక్సులో బాలయ్య
  • మొదట్లో మాటల కోసం తడుముకున్న వైనం
  • ఆపై కొనసాగిన బాలయ్య మాటల ప్రవాహం
  • ఉత్సాహంగా మ్యాచ్ లో లీనమైన నందమూరి హీరో
Balakrishna pick up in cricket commentary after starting trouble

టాలీవుడ్ కథానాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కామెంటేటర్ అవతారం ఎత్తారు. ఇవాళ్టి తొలి మ్యాచ్ సందర్భంగా ఆయన కామెంట్రీ బాక్స్ లో సందడి చేశారు. 

మ్యాచ్ కు ముందు స్టూడియో చర్చ కార్యక్రమంలో అలరించిన బాలయ్య... మ్యాచ్ మొదలైన తర్వాత కామెంటరీ చెప్పేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. అలవాటులేని పని కావడంతో మాటల కోసం తడుముకోవాల్సి వచ్చింది. అయితే అది కాసేపే!

ఆ తర్వాత బాలయ్య తనదైన శైలిలో పుంజుకున్నారు. మ్యాచ్ గురించి, ఆటగాళ్ల గురించే కాదు, ఇతర క్రీడలు, ఫిట్ నెస్, తదితర అంశాలపైనా తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉత్సాహంగా వ్యాఖ్యానం అందించారు. మ్యాచ్ లో చివరి ఓవర్లలో ఎంత స్కోరు కొడతారన్న దానిపై విశ్లేషణ చేశారు.

క్రీడలు శారీరకంగానే కాకుండా, మానసిక ఒత్తిళ్లను తగ్గించడంలోనూ ఉపయోగపడతాయని వివరించారు. తనకిష్టమైన బౌలర్లు షేన్ వార్న్, పాల్ ఆడమ్స్, అనిల్ కుంబ్లే అని వెల్లడించారు. ఇక తన తండ్రి ఎన్టీఆర్ తో షూటింగ్ అనుభవాలను కూడా పంచుకున్నారు. ఉత్సాహంగా కబుర్లు చెబుతూ ఇతర కామెంటేటర్లతో కలిసిపోయారు. బాలయ్య కామెంటరీ ఇంగ్లీషు, తెలుగులో కొనసాగింది.

More Telugu News