YS Sharmila: నాపై లుకౌట్ నోటీసులు ఇవ్వడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

  • ప్రశ్నాపత్రాల లీక్ కేసులో సిట్ పెద్ద తలకాయలను వదిలేస్తోందన్న షర్మిల
  • తాను నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నానని వెల్లడి
  • తనకు లుకౌట్ నోటీసులు ఇచ్చారంటూ ఆగ్రహం
  • ఇంతకంటే చేతకాని ముఖ్యమంత్రి ఇంకెవరుంటారని విమర్శలు
Sharmila fires on CM KCR in TSPSC paper leak issue

టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ దుమారం కొనసాగుతోంది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల కుంభకోణంలో సిట్ పెద్ద తలకాయలను వదిలేస్తోందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న తనపై లుకౌట్ నోటీసులు ఇచ్చారని, కేసీఆర్ నియంత పాలనకు ఇది నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే తనను రెండుసార్లు గృహ నిర్బంధం చేశారని, ఇప్పుడు దుర్మార్గంగా లుకౌట్ నోటీసులు ఇచ్చి, పోలీసులను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. 

"టీఎస్ పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకైన విషయంలో కేసీఆర్ ఒక సిట్ వేశారు. ఈ స్కాంలో పెద్దవాళ్ల ప్రమేయం ఏదీ లేదని, ఇందులో ఉన్నవాళ్లంతా చిన్నవాళ్లేనంటూ సిట్ ద్వారా చెప్పించి, ఈ కేసును సులువుగా ముగించే ప్రయత్నం చేస్తున్నారని మాకు తెలిసింది. అందుకే టీఎస్ పీఎస్సీని ముట్టడి చేయాలని వైఎస్సార్టీపీ నిర్ణయించింది. దాంతో నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో నేను ఎలాగోలా బయటపడి ఒక హోటల్ రూంలో రాత్రంతా ఉన్నాను. ఇవాళ టీఎస్ పీఎస్సీని ముట్టడించాలని నిర్ణయించుకుంటే, నా కోసం ఒక లుకౌట్ ఆర్డర్ ఇచ్చినట్టు తెలిసింది. 

నేనేమైనా క్రిమినల్ నా? నేనేమైనా తప్పు చేశానా? పేపర్ లీక్ చేసింది ఎవరు? పోలీసులకు ఇంకేమీ పనిలేనట్టుగా నా ఆఫీసు చుట్టూ మోహరించారు. పోలీసు బలగాలు ఉండాల్సింది ఎక్కడ? మీరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? నాపై లుకౌట్ నోటీసు ఇచ్చారంటే ఇంతకంటే చేతకాని ముఖ్యమంత్రి ఇంకెక్కడైనా ఉంటారా?

మీరు మాత్రం ఎంతైనా అవినీతి చేసుకోవచ్చు... కాళేశ్వరంలో స్కాం చేసుకోవచ్చు... మీ బిడ్డలు స్కాంలు చేసుకోవచ్చు... మీ వాళ్లందరూ క్వశ్చన్ పేపర్లు లీక్ చేసుకోవచ్చు... దళిత బంధు మీ అనుచరులకే ఇవ్వొచ్చు... డబుల్ బెడ్రూం ఇళ్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్లకే ఇవ్వొచ్చు... ఇలా మీరు మాత్రం ఎన్ని అక్రమాలకైనా పాల్పడతారు... పోలీసులను మీ రక్షణ కోసం వాడుకుంటారు" అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.

More Telugu News