పాకిస్థాన్‌లో హిందూ వైద్యుడి దారుణ హత్య

  • కరాచీ నగరంలో గురువారం హిందూ వైద్యుడిపై కాల్పులు
  • ఘటన స్థలంలోనే వైద్యుడి మృతి
  • వైద్యుడి వెంట ఉన్న సహాయకురాలికి బుల్లెట్ గాయాలు
  • దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
  • ఘటనపై సింధ్ ప్రావిన్స్ గవర్నర్ విచారం
Hindu doctor shot dead in pakistan

పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కరాచీ నగరంలో డా. బీర్బల్ జినానీ అనే హిందూ వైద్యుడిని గురువారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. కంటి వైద్యుడైన డా. జినానీ గతంలో కరాచీ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా పనిచేశారు. 

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డా. జినానీ తన అసిస్టెంట్ అయిన ఓ వైద్యురాలితో కలిసి కారులో గుల్షణ్-ఏ-ఇక్బాల్ ప్రాంతానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. లైయారీ ఎక్స్‌ప్రెస్ హైవేపై గార్డెన్ క్రాస్‌రోడ్స్‌ వద్దకు కారు చేరుకోగానే నిందితులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో డా. జినానీ అక్కడిక్కడే మృతి చెందగా ఆయన సహాయకురాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. 

కాల్పుల తరువాత డా. జినానీ ప్రయాణిస్తున్న కారు అదుపు కోల్పోయి ఓ గోడకు ఢీకొనడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. నిందితులు కావాలనే డా. జినానీని టార్గెట్ చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై సింధ్ గవర్నర్ కమ్రాన్ ఖాన్ టెసోరీ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కరాచీ పోలీస్ అడిషనల్ ఇన్స్‌స్పెక్టర్ జనరల్‌ను ఆదేశించారు.

More Telugu News