శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయంలో మెట్లబావి ఫ్లోరింగ్ కూలి 13 మంది మృతి

  • ఇండోర్‌లోని శ్రీ బాలేశ్వర్ ఆలయంలో ఘటన
  • మెట్లబావిని మూసివేస్తూ నిర్మించిన ఫ్లోరింగ్ కూలడంతో బావిలో పడిపోయిన భక్తులు
  • మృతుల్లో పదిమంది మహిళలు
13 dead fall in step well at Shree Baleshwar temple after roof collapses

ఓ ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు జరుగుతుండగా అపశ్రుతి చోటు చేసుకోవడంతో 13 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన. స్నేహ్‌నగర్‌లోని శ్రీ బాలేశ్వర్ ఆలయంలో నిన్న శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు. తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయంలోని పురాతన మెట్ల బావిని మూసివేస్తూ నిర్మించిన ఫ్లోరింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 13 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో 19 మందిని అధికారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు.

ఆలయంలో మెట్లబావిని మూసివేస్తూ నిర్మించిన ఫ్లోరింగ్‌పై దాదాపు 30 మంది భక్తులు కూర్చోవడంతో బరువును మోయలేక ఫ్లోరింగ్ కుప్పకూలింది. దీంతో 50 అడుగుల లోతున్న బావిలో వారంతా పడిపోయారు. అక్కడున్నవారు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ లోతు ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది నిచ్చెనల ద్వారా బావిలోకి దిగి 11 మృతదేహాలను వెలికి తీశారు. వీరిలో 10 మంది మహిళలే కావడం గమనార్హం. ఆ తర్వాత మరో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

More Telugu News