చూడ్డానికి తనలానే ఉన్న స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

  • 2017లో హర్యానాలోని పానిపట్‌లో ఘటన
  • స్నేహితురాలిని చంపేసి తన దుస్తులు తొడిగి, గుర్తింపు కార్డులు పడేసి ప్రియుడితో వెళ్లిపోయిన యువతి
  • ఫొటోల్లో ఉన్న ముక్కుపుడకను చూసి గుర్తించిన బాధిత యువతి తల్లిదండ్రులు
  • మూడేళ్ల తర్వాత నిందితుల అరెస్ట్
  • విచారణ సమయంలోనే మృతి చెందిన ప్రియుడు
Panipat court awarded life term to woman who killed her friend

ఎలాంటి ఆటంకం లేకుండా ప్రియుడితో కలిసి పారిపోవాలని భావించిన ఓ యువతి అందుకు ఓ నేరపూరిత పన్నాగాన్ని రచించింది. చూడ్డానికి తనలానే ఉన్న యువతిని హత్యచేయడం ద్వారా చనిపోయింది తానేనని నమ్మించాలని అనుకుంది. అయితే, పకడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ నిందితులు తప్పించుకోలేకపోయారు. తాజాగా ఈ కేసులో నిందితురాలికి కోర్టు జీవిత ఖైదు విధించింది. హర్యానాలోని పానిపట్‌లో 2017లో జరిగిందీ ఘటన. సంచలనం సృష్టించిన ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే..

జ్యోతి, కృష్ణ ఇద్దరూ కాలేజీ రోజుల నుంచే ప్రేమించుకున్నారు. సర్వసాధారణంగానే వీరి పెళ్లికి జ్యోతి తల్లిదండ్రులు  నో చెప్పారు. దీంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, తాము పారిపోయి పెళ్లి చేసుకున్నట్టు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఓ భారీ ప్లాన్ రచించారు. ఓ టీవీ సీరియల్ ప్రేరణతో తనలానే ఉన్న యువతిని చంపడం ద్వారా తాను చనిపోయినట్టు నమ్మించాలని జ్యోతి ప్లాన్ చేసింది.  

అందులో భాగంగా 5 సెప్టెంబరు 2017న చూడ్డానికి తనలానే ఉండే స్నేహితురాలు సిమ్రన్‌ను జీటీ రోడ్డుకు పిలిచింది. అక్కడ ఆమెకు జ్యోతి, కృష్ణ కలిసి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు. అది తాగి ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లాక గొంతు కోసి హత్య చేశారు. అనంతరం సిమ్రన్‌కు జ్యోతి తన దుస్తులు తొడిగి కొన్ని గుర్తింపు కార్డులు అక్కడ పడేసి ఇద్దరూ పరారయ్యారు. ఘటనా స్థలం వద్ద లభించిన ఆధారాలను బట్టి చనిపోయింది తమ కుమార్తేనని భావించిన జ్యోతి కుటుంబ సభ్యులు సిమ్రన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

మరోవైపు, తమ కుమార్తె కనిపించడం లేదంటూ సిమ్రన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు.. సిమ్రన్ హత్య సమయంలో తీసిన ఫొటోలను ఆమె తల్లిదండ్రులకు చూపించారు. ఆ ఫొటోల్లో సిమ్రన్ మెడకు ఉన్న దారం, ముక్కుపుడకను చూసి ఆమె తమ కుమార్తేనని గుర్తించారు. ఆ తర్వాత జరిగిన విచారణలో సిమ్రన్‌ను జ్యోతి, కృష్ణ కలిసి హత్య చేసినట్టు తేలింది. వారి కోసం గాలింపు మొదలుపెట్టిన పోలీసులు మూడేళ్ల తర్వాత అంటే 2020లో వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. క్షయ వ్యాధితో బాధపడుతున్న కృష్ణ కేసు విచారణలో ఉండగానే జైలులోనే మృతి చెందాడు. తాజాగా ఈ కేసులో తుదితీర్పు రాగా, జ్యోతికి పానిపట్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.

More Telugu News