ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని కూర్చొని వైసీపీ నేతలకు సవాల్ విసిరిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

  • ఉదయగిరికి వస్తే తరిమికొడతామంటూ మేకపాటికి వైసీపీ నేతల వార్నింగ్
  • విషయం తెలుసుకుని ఉదయగిరికి వచ్చిన మేకపాటి
  • తరిమికొడతామన్న వాళ్లు రావాలంటూ మేకపాటి వార్నింగ్
Mekapati Challenge to YSRCP leaders in Udayagiri

వైసీపీ బహిష్కృత నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ఉదయగిరికి వస్తే తరిమికొడతామంటూ ఆయనకు వైసీపీ నేతలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఉదయగిరికి వచ్చారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని కూర్చొని... తనను తరిమి కొడతానన్న వాళ్లు రావాలంటూ ఛాలెంజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు కూడా అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడ ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు. 

ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మేకపాటి ఓటు వేశారంటూ ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో, అప్పటి నుంచి వైసీపీ వర్గీయులు ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయగిరికి వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. ఈ ఉదయం కూడా ఉదయగిరి నియోజకవర్గం నుంచి వెళ్లిపో అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. 

ఈ విషయం తెలుసుకున్న మేకపాటి మర్రిపాడు నుంచి ఉదయగిరికి చేరుకుని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తనపై అభాండాలు వేసి పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. కేవలం ప్రజల అండతోనే తాను ఎమ్మెల్యేగా గెలుస్తున్నానని చెప్పారు. తనను తరిమికొడతాన్న వారు ఎవరొస్తారో రావాలని సవాల్ విసిరారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

More Telugu News