Anand Mahindra: ఫ్యాన్ మేడ్ ఐస్ క్రీమ్.. మన దేశంలోనే: ఆనంద్ మహీంద్రా

  • కేవలం భారత్ కే ఇది సొంతమన్న పారిశ్రామికవేత్త
  • ఫ్యాన్, ఐస్ గడ్డల సాయంతో ఐస్ క్రీమ్ తయారు చేసిన మహిళ
  • పట్టుదల ఉన్న చోట మార్గం ఉంటుందన్న పారిశ్రామికవేత్త
Anand Mahindra hand made fan made ice cream video is superhit on Twitter

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన వీడియోని అందరికీ పరిచయం చేశారు. ఐస్ క్రీమ్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని వినే ఉంటారు. కాకపోతే ఐస్ క్రీమ్ తయారీకి పాలు, మైదా, పంచదార తదితర పదార్థాలతో పాటు, గడ్డ ఐస్ క్రీమ్ గా మారేందుకు రిఫ్రిజిరేటర్ కావాలి. కానీ, ఇవన్నీ లేకపోయినా చక్కగా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చన్నది ఆనంద్ మహీంద్రా తీసుకొచ్చిన వీడియో తెలియజేస్తోంది.

ఈ వీడియోని తన ట్విట్టర్ పేజీలో ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు. ‘‘కృత నిశ్చయం ఉన్న చోట మార్గం ఉంటుంది. హ్యాండ్ మేడ్, ఫ్యాన్ మేడ్ ఐస్ క్రీమ్. ఓన్లీ ఇండియా’’ అని ట్వీట్ చేశారు. భారత్ లో మాత్రమే తయారయ్యే చేతితో, ఫ్యాన్ తో చేసే ఐస్ క్రీమ్ అన్నది ఆయన మాటల్లోని అర్థం. మహిళ ఐస్ క్రీమ్ తయారీ నైపుణ్యాలను నెటిజిన్లు మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు.

ఓ మహిళ ముందుగా పాలతో ఐస్ క్రీమ్ ద్రావకాన్ని స్టవ్ పై సిద్ధం చేస్తుంది. ద్రవ పదార్థాన్ని ఓ స్టీల్ క్యాన్ లో పోసింది. ఓ బల్లపై అల్యూమినియం పాత్ర పెట్టి దానిలో ఈ స్టీల్ క్యాన్ ను కూర్చోబెట్టింది. చుట్టూ ఐస్ గడ్డలు వేసింది. స్టీల్ క్యాన్ హ్యాండిల్ కు తాడు కట్టేసింది. ఆ తాడు రెండో వైపున సీలింగ్ ప్యాన్ కు బిగించి ఉంది. ఆ తర్వాత ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసింది. దాంతో ఫ్యాన్ వేగానికి కింద అల్యూమినియం పాత్రలో పెట్టిన స్టీల్ క్యాన్ వేగంగా తిరిగింది. ఈ వేగానికి లోపలున్న మిశ్రమం, చుట్టూ ఉన్న ఐస్ ప్రభావానికి గట్టి పడుతుంది. దాన్ని గాజు కప్పులో వేసుకుని తినేయడమే తరువాయి.

More Telugu News