Chile: మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు.. చిలీలో గుర్తింపు

  • 53 ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకినట్టు తేల్చిన చిలీ ఆరోగ్య శాఖ
  • అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడి
  • గతేడాది చిలీ అటవీ జంతువుల్లో బర్డ్ ఫ్ల్యూ గుర్తింపు
Chile detects 1st case of bird flu in human

పక్షులు, జంతువులకు పరిమితం అయిన బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనుషుల్లో వెలుగుచూసింది. చిలీ దేశంలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ తొలి కేసును గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ దేశంలో 53 ఏళ్ల వ్యక్తిలో తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా లక్షణాలు కనిపించాయని, పరీక్షించగా బర్డ్ ఫ్లూ అని తేలిందని చిలీ ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన రోగితో కలిసి ఉన్న వారిని కూడా వైద్యులు పరిశీలిస్తున్నారు. చిలీ దేశంలోని అడవి జంతువుల్లో గత సంవత్సరం హెచ్ 5 ఎన్1 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 

చిలీ దేశ పారిశ్రామిక క్షేత్రాల్లో కేసులు వెలుగు చూడటంతో  ప్రభుత్వం పౌల్ట్రీ ఎగుమతులను నిలిపివేసింది. అర్జెంటీనాలోని పారిశ్రామిక క్షేత్రాల్లోనూ కేసులు వచ్చాయి. కాగా, చిలీ ఆరోగ్య అధికారులు ఈ వైరస్ పక్షులు లేదా సముద్రపు క్షీరదాల నుంచి మానవులకు సంక్రమించవచ్చని గుర్తించారు. ఇది మనిషి నుంచి మనిషికి సంక్రమించిందా? అనే విషయంపై స్పష్టత లేదు. ఈ ఏడాది ఆరంభంలో ఈక్వెడార్ లో 9 ఏళ్ల బాలికలో బర్డ్ ఫ్లూ మానవ సంక్రమణ కేసును ధ్రువీకరించారు. కాగా, ఈ వ్యాధి మానవుల మధ్య సంక్రమించే ప్రమాదం తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య అధికారులు చెప్పారు. మరోవైపు వ్యాక్సిన్ తయారీదారులు మనుషుల కోసం బర్డ్ ఫ్లూ టీకాలను సిద్ధం చేస్తున్నారు.

More Telugu News