Taiwan: న్యూయార్క్ లో దిగిన తైవాన్ అధ్యక్షురాలు.. చైనా హెచ్చరికలు

  • 1 వరకు న్యూయార్క్ లోనే ఉండనున్న తైవాన్ అధ్యక్షురాలు వెన్
  • గ్వాటెమాల, బెలిజ్ దేశాల సందర్శన
  • యూఎస్ హౌస్ స్పీకర్ ను కలుసుకునే అవకాశం
  • భేటీ కావొద్దంటూ చైనా బెదిరింపు
China threatens reprisal as Taiwan President Tsai Ing wen arrives in New York

తైవాన్ అధ్యక్షురాలి పర్యటనతో మరోసారి చైనా, అమెరికా మధ్య వాతావరణం వేడెక్కింది. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ బుధవారం న్యూయార్క్ చేరుకున్నారు. యఎస్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్ కార్తీతో సమావేశం అయితే దృఢంగా పోరాడతామని చైనా ప్రకటించింది. తైవాన్ అధ్యక్షురాలు న్యూయార్క్ చేరుకోవడానికి ముందు.. అమెరికా జాతీయ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. సాయ్ అమెరికా పర్యటనను చైనా సాకుగా తీసుకుని తైవాన్ జలసంధి చుట్టూ కార్యకలాపాలను వేగవంతం చేయవద్దని సూచించారు. 

సాయ్ ఇంగ్ వెన్ అమెరికాతో పాటు గ్వాటెమాల, బెలిజ్ దేశాలనూ సందర్శించనున్నారు. తైవాన్ ను దౌత్య పరమైన దేశంగా అవి గుర్తించాయి. శనివారం వరకు తైవాన్ అధ్యక్షురాలు న్యూయార్క్ లోనే ఉండనున్నారు. లాస్ ఏంజెలెస్ ను కూడా సందర్శించనున్నారు. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు కానీ, క్యాలిఫోర్నియాలో స్పీకర్ మెక్ కార్తీని కలుసుకుంటారని తెలుస్తోంది.

తైవాన్ తన సొంత ప్రాదేశిక ప్రాంతమని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. తైవాన్ సొంతంగా పాలించుకుంటున్నప్పటికీ, అది తమ దేశంలో భాగమంటోంది. మరోవైపు అమెరికా పర్యటనకు వెళ్లడానికి ముందు సాయ్ ఇంగ్ వెన్ మాట్లాడుతూ.. బయటి నుంచే వచ్చే ఒత్తిళ్లు ఇతర ప్రపంచంతో తైవాన్ సంప్రదింపులకు అడ్డు కాబోదన్నారు. 

‘‘మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. మేమేమీ ప్రేరేపించడం లేదు. తైవాన్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం విషయంలో బలంగా నిలబడుతుంది. మార్గం కష్టంగానే ఉన్నా, తైవాన్ ఒంటరి కాబోదు’’ అని అన్నారు. గతేడాది ఆగస్ట్ లో యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ ను సందర్శించిన సందర్భంగా చైనా, అమెరికా మధ్య విభేదాలు తలెత్తడం తెలిసిందే. నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన ముగిసిన తర్వాత.. చైనా బలగాలు తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేయడం గమనార్హం.

More Telugu News