Bolero Vehicle: భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్.. 5 గంటలకుపైగా నిలిచిపోయిన రైలు!

  • తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఘటన
  • గేటును ఢీకొట్టి వెళ్లేందుకు ప్రయత్నించిన దుండగులు
  • ట్రాక్‌పైకి వచ్చి ఆగిపోయిన వాహనం
  • పూర్తిగా ధ్వంసమైన బొలెరో.. దెబ్బతిన్న రైలు ఇంజిన్
  • బొలెరోలో వెళ్తున్న వారు దొంగలని అనుమానం
Duranto Express Collided Bolero Vehicle at Bhimadole Junction

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. ప్రమాదంలో బొలెరో ధ్వంసం కాగా, రైలు ఇంజిన్ దెబ్బతినడంతో దాదాపు ఐదు గంటలుగా రైలు ట్రాక్‌పైనే నిలిచిపోయింది. దీంతో మరో ఇంజిన్ తీసుకొచ్చి రైలుకు అమర్చి పంపేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 

దురంతో ఎక్స్‌ప్రెస్ వస్తుండడంతో భీమడోలు జంక్షన్ వద్ద సిబ్బంది రైల్వే గేటును మూసివేశారు. అయితే, అదే సమయంలో బొలెరో వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు గేటును ఢీకొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాహనం సరిగ్గా రైల్వే ట్రాక్‌పైన ఆగిపోయింది. అదే సమయంలో రైలు దూసుకొస్తుండడంతో వారు వాహనం దిగి పరారయ్యారు. వేగంగా వచ్చిన రైలు వాహనాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో వాహనం పూర్తిగా ధ్వంసం కాగా, రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతింది.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ట్రాక్‌పై నుంచి బొలెరోను తొలగించారు. అయితే, రైలు ఇంజిన్ దెబ్బతినడంతో మరో ఇంజిన్‌ను తెప్పిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు వాహనంలో వచ్చింది ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. వారు దొంగలు అయి ఉండొచ్చని, పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. పరారైన దుండగుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News