లోకేశ్ పాదయాత్రలో జేసీ ప్రభాకర్ రెడ్డి... ఫొటో ఇదిగో!

 • పెనుకొండ నియోజకవర్గంలో యువగళం
 • 54వ రోజు పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్న లోకేశ్
 • టీడీపీ 41వ ఆవిర్భావ దినం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి
 • నల్లగొండ్రాయనిపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరణ
JC Prabhakar Reddy joins Lokesh Padayatra in Penukonda constituency

పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పార్టీ అభిమానులు, కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. యువగళం పాదయాత్ర 54వ రోజు సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయనిపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. 

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల నివాళులర్పించిన లోకేశ్, అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పాదయాత్రలో లోకేశ్ ను టీడీపీ సీనియర్ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, గంటి హరీశ్ కలిసి సంఘీభావం తెలిపారు. లోకేశ్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న జేసీ... మనస్ఫూర్తిగా అభినందించారు. లోకేశ్ తో కలిసి పాదయాత్రలో అడుగులు వేశారు.

లోకేశ్ వ్యాఖ్యలు...

 • జె-ట్యాక్స్ కోసం ఏపీ ఇమేజ్ ను జగన్ దెబ్బతీశారు
 • పన్నుమీద పన్నులు కట్టలేక వ్యాపారాలు మూతపడ్డాయి
 • మార్కెట్లన్నీ దళారుల చేతిలోకి వెళ్లిపోయాయి
 • అధికారంలోకి వచ్చాక చిన్నపరిశ్రమలకు రాయితీలు
 • జగనోరా వైరస్ కు మరో ఏడాదిలో వ్యాక్సిన్!
 • కరోనా తరువాత ఇస్తామన్న రీస్టార్ట్ ప్యాకేజ్ కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. 
 • జగన్ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ దేశంలోనే నంబర్ 1. 
 • టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తాం. 
 • ఆక్వా రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసాడు జగన్. ఆక్వా రంగానికి ఇచ్చే సబ్సిడీలు అన్ని రద్దు చేశాడు. 
 • జగన్ పాలన లో ఇసుక, సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. ఒక్క అక్రమ ఇసుక రవాణా ద్వారానే జగన్ కి రోజుకి 3కోట్లు సంపాదిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుక తక్కువ ధరకు అందిస్తాం.

అధికారంలోకి వచ్చాక తెలుగు జీఎస్టీ పోర్టల్!

ఆస్తిపన్నును ఈ ప్రభుత్వం విలువ ఆధారంగా పెట్టిందని నారా లోకేశ్ విమర్శించారు. హైదరాబాద్ (తెలంగాణ) కన్నా ఎక్కువ ఆస్తి పన్ను వసూలు చేస్తోందని ఆరోపించారు. అదే సమయంలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని మండిపడ్డారు. 

"పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ కింద తీసుకురావడానికి సమయం పడుతుంది. అధికారంలోకి వచ్చాక 3 నెలల్లో జీఎస్టీ పోర్టల్ తెలుగులో వచ్చేలా చేస్తాం. నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి కారణం పెట్రోల్, డీజల్ ధరలు పెరగడమే. బస్సు ఛార్జీల ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ పై ఉన్న పన్నులు తగ్గించి ధరలు తగ్గిస్తాం. ఈ కామర్స్ పోయి క్విక్ కామర్స్ వచ్చింది. మా ప్రభుత్వం వచ్చాక కిరాణా షాపు వాళ్లు ప్రభుత్వానికి కట్టే పన్నులు తగ్గించే ప్రయత్నం చేస్తాం" అని తనను కలిసిన వ్యాపారులకు భరోసా ఇచ్చారు.

యువనేతను కలిసిన రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ప్రతినిధులు

పెనుగొండ నియోజకవర్గం నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ప్రతినిధులు లోకేశ్ ను కలిసి సమస్యలను విన్నవించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యంచేసి, బ్రాహ్మణులకోసం గత ప్రభుత్వంలో అమలుచేసిన పథకాలన్నీ రద్దుచేశారని ఆరోపించారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... బ్రాహ్మణ సమాజంలో పేదరికాన్ని గుర్తించి దేశంలోనే తొలిసారిగా 2014లో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ.300 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత చంద్రబాబునాయుడు గారిది అని వెల్లడించారు. 

"పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం భారతి విద్యాపథకం, గాయత్రి విద్యాప్రశక్తి పథకం, వశిష్ట విద్యాపథకం, ద్రోణాచార్య పథకాలను అమలుచేసి పోటీపరీక్షలకు శిక్షణ కూడా ఇప్పించాం. చాణుక్య పథకం ద్వారా వ్యాపారాలు, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించుకునేందుకు ఆర్థికసాయం కూడా అందించాం. గరుడ పథకం ద్వారా పేద బ్రాహ్మణులు మరణించినపుడు అంత్యక్రియల నిర్వహణకు రూ.10వేల రూపాయలు అందజేశాం. కనీస మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి చివరకు పేదబ్రాహ్మణులు గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు ఉద్దేశించిన పథకాన్ని కూడా రద్దుచేశాడు. 

బ్రాహ్మణుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. గత ప్రభుత్వంలో అమలుచేసిన పథకాలన్నింటినీ అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్దరిస్తాం. పేద బ్రాహ్మణులకోసం ఇళ్లస్థలాలు కేటాయించి పక్కాగృహాలు నిర్మిస్తాం. మీ అందరి సంక్షేమానికి పాటుపడే చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు మీ వంతు సహకారం అందించండి" అని సూచించారు.

లోకేశ్ ను కలిసిన పట్టురైతులు

పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో ఏపీ పట్టు రైతుల రాష్ట్ర కమిటీ ప్రతినిధులు లోకేశ్ ను కలిసి సమస్యలు విన్నవించారు. రాష్ట్రంలో అతితక్కువ వర్షపాతం కలిగిన శ్రీ సత్యసాయిజిల్లాలో ఎక్కువమంది రైతులు మల్బరీ సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు.

గత ప్రభుత్వ హయాంలో పట్టురైతులకు కిలోకి రూ. 50 ప్రోత్సహకంగా అందించారని, డ్రిప్, మొక్కల కొనుగోలు, షెడ్ల నిర్మాణానికి సబ్సిడీతోపాటు రాయితీపై స్ప్రేయర్లు, ఇతర పనిముట్లు అందించారని వివరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో పట్టురైతులకు ఇచ్చిన సబ్సిడీలన్నీ ఎత్తేశారని వాపోయారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ.... రాష్ట్రంలో రైతురాజ్యం తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతన్న వెన్ను విరుస్తున్నాడని మండిపడ్డారు. 

"జగన్ పాలనలో పట్టు రైతులతోపాటు అన్నివర్గాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల అకాలవర్షాల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోగా కనీసం ఆ ప్రాంతాల్లో పర్యటించే దిక్కులేదు. గోరుచుట్టుపై రోకటిపోటుగా మోటార్లకు మీటర్లు పెట్టి రాయలసీమ రైతుల మెడకు ఉరితాడు బిగించాలని చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో పట్టు రైతులకు ఇచ్చిన రాయితీలన్నీ పునరుద్ధరిస్తాం, పట్టు రైతులకు సంబంధించిన బకాయిలను విడుదల చేస్తాం. ఎన్ఆర్ఈజీఎస్ ను పట్టు సాగుకు అనుసంధానించే అంశాన్ని పరిశీలిస్తాం" అని హామీ ఇచ్చారు.

*******

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 695.1కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 18.6 కి.మీ.*

*55వరోజు (30-3-2023) యువగళం పాదయాత్ర వివరాలు:*

*పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం*

ఉదయం

8.00 – పెనుకొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.15 – హరిపురంలో స్థానికులతో మాటామంతీ.

9.35 – మునిమడుగు కియా ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులతో మాటామంతీ.

10.30 – అమ్మవారిపల్లిలో స్థానికులతో మాటామంతీ.

11.10 – యువగళం పాదయాత్ర 700 కి.మీ.లకు చేరిక.

11.20 – గుట్టూరులో 700 కి.మీ.లకు చేరిన సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ.

మధ్యాహ్నం

12.00 – గుట్టూరు హైవే పక్కన కుంచిటిగ వక్కలింగ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

1.00 – గుట్టూరు హైవే పక్కన భోజన విరామం.

2.00 – గుట్టూరు హైవే వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

సాయంత్రం

3.30 – యువగళం పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశం.

3.45 – సికెపల్లి శివార్లలో స్థానికులతో మాటామంతీ.

4.20 – కోన రోడ్డులో స్థానికులతో మాటామంతీ.

4.35 – సి.కె పల్లి పంచాయితీ కోన క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.


More Telugu News