తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

  • టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ
  • కాసాని జ్ఞానేశ్వర్ కు చంద్రబాబు అభినందనలు
  • తెలంగాణ టీమ్ బాగా పనిచేస్తోందన్న టీడీపీ అధినేత
  • ఇంకా స్పీడ్ పెంచాలని పిలుపు
  • కార్యకర్తలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానన్న బాబు 
Chandrababu appreciates TDP Telangana wing

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా, కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలోని తెలంగాణ టీడీపీ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. 

ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ పేరిట వారు చేపడుతున్న కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగుతోందని కొనియాడారు. తెలంగాణ టీమ్ బాగా పనిచేస్తోందని, ఇంకా స్పీడ్ పెంచాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కూడా తప్పకుండా టీడీపీకి పూర్వవైభవం వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ రావాల్సిన అవసరం ఉందని, ఇది చారిత్రక అవసరం అని స్పష్టం చేశారు. 

"ఈ సందర్భంగా తెలుగుజాతి మూడు నిర్ణయాలు స్వీకరించాలి. 2047కి భారత్ దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో భారతీయులకు గౌరవం లభిస్తుంది. అందులో తెలుగుజాతి అగ్రస్థానాన నిలవాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి... పేదలకు అండగా నిలివాలి. మీరు బాగుండడమే కాదు, మీతో సమానంగా కొంతమందిని పైకి తీసుకువచ్చే బాధ్యత మీది... మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాది. కుటుంబాలను దత్తత తీసుకోవాలి.  అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, వృత్తులకు న్యాయం చేయాలి. ఇదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం" అని వివరించారు. 

కాగా, టీడీపీలో శాశ్వత సభ్యత్వం కోసం రూ.5 వేలు రుసుం నిర్ణయించామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీని క్రియాశీలకం చేసేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ప్రజలను భాగస్వాములను చేసి పార్టీ నడపాలనేది తన సంకల్పం అని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణకు, ఏపీకి వ్యత్యాసం ఉండొచ్చని, కానీ సంకల్పం గొప్పదైతే అందరం పైకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.

అలాంటి సంకల్పానికి నాంది పలికిన రోజు మార్చి 29 అని, టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తున్నానని వివరించారు. సర్వం కోల్పోయినా పార్టీ జెండా మోస్తున్న నా కుటుంబ సభ్యుల్లాంటి కార్యకర్తలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు.

More Telugu News