Visakhapatnam: సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిన గాజువాక దంపతుల మృతి.. ఏలేరు కాలువలో మృతదేహాల లభ్యం

Visakha Couple Who Went Missing After Selfie Video Found Dead
  • అప్పుల బాధతోనే ఆత్మహత్య!
  • తమ పిల్లల్ని ఎవరూ ఏమీ అనొద్దని సెల్ఫీ వీడియోలో వేడుకోలు
  • ఫోన్ చివరి సిగ్నల్ ఆధారంగా కొప్పాక ఏలేరు కాలువలో గజ ఈతగాళ్లతో గాలింపు
ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిన విశాఖపట్టణానికి చెందిన వరప్రసాద్ (47), మీరా (41) దంపతుల కథ విషాదాంతమైంది. అనకాపల్లి జిల్లా రాజుపాలెం సమీపంలోని కొప్పాక ఏలేరు కాలువలో వారి మృతదేహాలను గుర్తించారు. 

పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ ఉక్కునగరం ఎస్ఎంఎస్-2 విభాగంలో పనిచేస్తున్న చిత్రాడ వరప్రసాద్, మీరా దంపతులు గాజువాక పరిధిలోని శివాజీ నగర్‌లో నివసిస్తున్నారు. వీరికి కుమారుడు కృష్ణసాయితేజ, కుమార్తె దివ్యలక్ష్మి ఉన్నారు. కుమారుడు బ్యాటరీ దుకాణం నిర్వహిస్తుండగా, కుమార్తెకు గతేడాది వివాహమైంది. 

తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వరప్రసాద్ దంపతులు సెల్ఫీ వీడియో తీసుకుని సోమవారం సాయంత్రం దానిని బంధువులకు పంపారు. తామిద్దరం వెళ్లిపోతున్నామని, తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని వారు ఆ వీడియోలో కోరారు. వారిని ఎవరూ ఏమీ అనొద్దని, ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా దానిని పట్టించుకోవద్దని పిల్లలకు సూచించారు. ఆ తర్వాత వారి ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. దీంతో కుమారుడు కృష్ణతేజ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి ఫోన్ సిగ్నల్‌ను ట్రేస్ చేశారు. అది చివరిసారి అనకాపల్లి సమీపంలోని కొప్పాక ఏలేరు కాల్వ వద్ద చూపించడంతో అక్కడికి వెళ్లారు. 

కాలువ గట్టు వద్ద వరప్రసాద్ దంపతుల చెప్పులు, చేతి సంచి, ఇతర వస్తువులను గుర్తించిన పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి కాలువలో గాలింపు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోవడంతో ఈ ఉదయం మరోమారు  గాలించడంతో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. అధిక వడ్డీలకు తీసుకున్న అప్పులు చెల్లించలేకపోవడం, డబ్బులు ఇచ్చిన వారి నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తట్టుకోలేకే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు.
Visakhapatnam
Selfie Video
Andhra Pradesh

More Telugu News