Lok Sabha: ఎంపీ ఫైజల్ పై అనర్హత వేటును ఎత్తివేసిన లోక్ సభ

  • హత్యాయత్నం కేసులో ఫైజల్ కు 10 ఏళ్ల శిక్ష విధించిన కింది కోర్టు
  • ఫైజల్ ను నిర్దోషిగా హైకోర్టు ప్రకటించినా జాప్యం చేస్తున్న లోక్ సభ సెక్రటేరియట్
  • ఈ అంశాన్ని ఈరోజు విచారించనున్న సుప్రీంకోర్టు
  • సుప్రీంలో వాదనలకు ముందే వెనక్కి తగ్గిన లోక్ సభ సచివాలయం
Lakshadweep MP Faisal disqualification lifted by Loak Sabha secretariat

లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ పై విధించిన అనర్హత వేటును లోక్ సభ ఈరోజు ఉపసంహరించుకుంది. అనర్హత వేటును ఉపసంహరించుకుంటున్నట్టు లోక్ సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 5న ఫైజల్ పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదయింది. ఈ కేసులో ఈ ఏడాది జనవరి 11న ఫైజల్ తో పాటు మరో ముగ్గురుకి కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ క్రమంలో జనవరి 13న లోక్ సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. 

దీంతో ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన కేరళ హైకోర్టు ఆయన శిక్షపై స్టే విధించింది. అయినప్పటికీ ఆయనపై అనర్హతను ఉపసంహరించుకోవడంలో లోక్ సభ సెక్రటేరియట్ జాప్యం చేస్తూ వచ్చింది. దీంతో ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే లోక్ సభ సెక్రటేరియట్ వెనక్కి తగ్గింది. ఫైజల్ పై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అనర్హతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాహుల్ విషయంలో కూడా మలుపులు చోటు చేసుకుంటాయేమో వేచి చూడాలి. 

More Telugu News