Ntr: 'లవకుశ' కోసం అందరికంటే ఎక్కువ కష్టపడింది ఘంటసాలనే: 'కుశ' పాత్రధారి సుబ్రహ్మణ్యం

  • తెలుగు పౌరాణిక చిత్రరాజం 'లవకుశ'
  • 'కుశ' పాత్రను పోషించిన సుబ్రహ్మణ్యం 
  • ఎన్టీఆర్ రాముడిలానే కనిపించారని వ్యాఖ్య
  • నిర్మాత ఇబ్బందులు పడ్డారని వెల్లడి 
  • ఇప్పటికీ ఈ సినిమా పాటలు వినిపిస్తున్నాయంటూ హర్షం
Lavakusha Subrahmanyam Interview

ఎన్టీ రామారావు కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'లవ కుశ' ముందు వరుసలో కనిపిస్తుంది. ఈ సినిమాలో 'లవుడు' పాత్రలో నాగరాజు .. 'కుశుడు' పాత్రలో సుబ్రహ్మణ్యం నటించారు. రేపు 'శ్రీరామనవమి' కావడంతో, తాజాగా చేసిన ఇంటర్వ్యూలో 'కుశ' పాత్రధారి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. "నా 11 ఏళ్ల వయసులో 'కుశుడు' పాత్రను పోషించే అవకాశం నాకు దక్కింది. శ్రీరాముడిగా సెట్లో ఎన్టీ రామారావుగారిని చూడగానే, దణ్ణం పెడుతూ అలా నుంచుండి పోయాను" అన్నారు. 

'లవ కుశ' తెలుగులో వచ్చిన తొలి గేవా కలర్ సినిమా. 24 రీళ్లతో ఈ సినిమా విడుదలైంది. ఇంతపెద్ద సినిమా మళ్లీ ఇంతవరకూ రాలేదు. అప్పట్లో వాహిని స్టూడియో ఖరీదు 20 లక్షలు. కానీ అందులో నిర్మించిన 'లవకుశ' కోసం అయిన ఖర్చు 30 లక్షలకి పైనే. నిర్మాత అల్లా రెడ్డి శంకర్ రెడ్డి ఒక దశలో ఆర్ధిక ఇబ్బందులు పడ్డారు. నాలుగేళ్ల పాటు సినిమా ఆగిపోయింది. ఆ తరువాత మళ్లీ మొదలైంది" అని చెప్పారు. 

"బాణాలు సంధించడం ఎలా అనే అనే విషయంపై మాకు 6 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. చిత్తూరు నాగయ్య గారు కూడా మాకు ఎన్నో సూచనలు ఇచ్చేవారు. ఈ సినిమా కోసం మేమంతా పడిన కష్టం ఒక ఎత్తు .. ఘంటసాలవారు పడిన కష్టం ఒక ఎత్తు. ఈ సినిమాకి ఆయనే సంగీతాన్ని అందించారు. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లయినా, ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు .. పద్యాలు దేవాలయాల్లో మోగుతున్నాయంటే, అందుకు కారణం ఆయన పడిన కష్టమే" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News