KTR: అప్పుడు కర్మకాలి అలా మాట్లాడాను.. ఏపీ రోడ్లపై గతంలో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్

  • ఏపీ రోడ్లపై తన వ్యాఖ్యలను టీవీల్లో చూపించి రచ్చ చేశారన్న కేటీఆర్
  • ఇప్పుడు అంతా బాగుందనే చెబుతానన్న మంత్రి
  • తాను గుంటూరులోనే ఇంటర్ చదువుకున్నానని గుర్తు చేసుకున్న వైనం
  • టొరంటో, ఒటావా కంటే హైదరాబాదే బాగుందని కెనడా నుంచి వచ్చిన మిత్రుడు చెప్పాడన్న కేటీఆర్
KTR Said He Pursued Inter in Guntur

ఆంధ్రప్రదేశ్‌లోని రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన కర్మకాలి తన మిత్రుడు ఇలా అన్నాడని క్రెడాయ్ మీటింగులో చెప్పానని, దానిని రోజంతా టీవీలో చూపించి రచ్చ చేశారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో నిన్న నిర్మాణరంగ సంస్థల ప్రతినిధుల భేటీలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లా ఇప్పుడు మాట్లాడబోనని, గుంటూరు బాగుంది, విజయవాడ బాగుంది, విశాఖపట్టణం బాగుందని చెబితే ఏ గొడవా ఉండదని నవ్వుతూ పేర్కొన్నారు.

దేశంలోనే అతిపెద్ద అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా ఆవిర్భవించిన అమరావతిలో ఇప్పుడు పనులేమీ జరగడం లేదని, కాబట్టి ఇప్పుడు హెచ్‌ఎండీఏనే అతిపెద్ద అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా కొనసాగుతోందని మంత్రి అన్నారు. తాను గుంటూరులోనే ఇంటర్మీడియెట్ చదువుకున్నానన్న కేటీఆర్.. తన ఇంటర్ స్నేహితుడు క్రాంతికిరణ్ పదహారున్నర సంవత్సరాల తర్వాత కెనడా నుంచి ఇటీవల ఇండియాకు వచ్చాడని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను ఎలాగూ గుర్తుపట్టలేవు కాబట్టి గుంటూరునైనా గుర్తుపట్టావా? అని ప్రశ్నించానని అన్నారు. దానికతడు గుంటూరు మారిందని చెప్పాడని అయితే, హైదరాబాద్ మాత్రం కెనడాలోని టొరంటో, రాజధాని ఒట్టావా కంటే బాగుందని చెప్పాడని అన్నారు.

More Telugu News