కియా అనుబంధ సంస్థల ఉద్యోగులను చూసి ఆనందంతో ఉప్పొంగిన లోకేశ్

  • నేడు లోకేశ్ పాదయాత్రకు 53వ రోజు
  • పెనుకొండ నియోజకవర్గంలో యువగళం
  • లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, మహిళలు
  • చంద్రబాబు దార్శనికుడు అంటూ లోకేశ్ వ్యాఖ్యలు
Lokesh feels happy after seeing KIA in Penukonda constituency

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలో విజయవంతంగా సాగింది. 53వ రోజు పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గం గుమ్మయ్యగారిపల్లి క్యాంపు సైట్ నుంచి మంగళవారం ఉదయం ప్రారంభమైంది. గుమ్మయ్యగారిపల్లి గ్రామంలో యువనేతకు అభిమానులు, గ్రామప్రజలు ఘనస్వాగతం పలికారు. మల్లాపల్లిలో మహిళలు హారతులిచ్చి నీరాజనాలు పలికారు. రాగిమేకలపల్లి వద్ద మహిళలు, వృద్ధులను యువనేత ఆప్యాయంగా పలకరించి వారి కష్టాలను తెలుసుకున్నారు. 

పాలసముద్రం భోజన విరామ స్థలం వద్ద బీసీలతో ముఖాముఖి నిర్వహించిన యువనేత వారి సాదకబాధలు తెలుసుకున్నారు. యువనేత పాదయాత్రకు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు సంఘీభావం తెలిపారు. .

సీబీఎన్ కియా విజ‌న్‌... నిజ‌మైందిలా...!

లోకేశ్ పెనుకొండ వద్ద కియా పరిశ్రమను చూసి ఆనందంతో పొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన... క‌ళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు... థిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అంటూ ఓ సినిమా డైలాగ్ ను వదిలారు. 

"చంద్రబాబు దునియా మొత్తం చూసేశారు. ఆ దూర‌దృష్టి నుంచి వ‌చ్చే ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడ‌తారు కాబ‌ట్టే ఆయ‌న‌ని దార్శనికుడు అని అంటారు. చంద్రబాబు ఎన్నో వ్యయ‌ప్రయాస‌ల‌కోర్చి కియాని తీసుకొచ్చిన‌ప్పుడు, క‌మీష‌న్ల కోసం తెచ్చార‌ని వైసీపీ నేత‌లు ఆరోపించారు. కార్లు అమ్ముడుపోని కంపెనీని తెచ్చి ఏం చేస్తార‌ని హేళ‌న చేశారు. అన‌తికాలంలోనే కియాలో త‌యారైన కార్లు దేశ‌మంతా దూసుకుపోతున్నాయి. కియా అనుబంధసంస్థలు వేల‌ సంఖ్యలో యువ‌త‌కి ఉద్యోగాలు క‌ల్పిస్తున్నాయి. 

అయితే, కియాని విమ‌ర్శించిన వైసీపీ వాళ్లు, కియా త‌మ మ‌హామేత లేఖ రాయ‌డం వ‌ల్ల వ‌చ్చింద‌ని ఓ ఫేక్ ఉత్తరం సృష్టించి అసెంబ్లీలో చ‌దివి అల్పసంతోషం మిగుల్చుకున్నారు. కానీ కియా తెచ్చింది చంద్రబాబు అని, టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో వ‌చ్చింద‌ని అంద‌రికీ తెలుసు" అని స్పష్టం చేశారు.

యువ‌గ‌ళం పాద‌యాత్ర పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలోని పాల‌సముద్రం పంచాయ‌తీలో ఉన్న కియా అనుబంధ సంస్థల మీదుగా సాగింది. వంద‌లాది ఉద్యోగులు త‌న‌కి ఎదురుప‌డ‌టంతో వారితో మాట్లాడిన లోకేశ్ త‌మ క‌ష్టానికి త‌గిన ప్రతిఫ‌లం యువ‌తకి ఉద్యోగ ఉపాధి రూపంలో దొరికిందని ఆనందంతో ఉప్పొంగిపోయారు. కియా అనుబంధ సంస్థల‌లో ఉద్యోగం చేస్తున్న ప‌ద్మావ‌తి అనే సోద‌రి లోకేష్‌తో పాటు కొద్దిదూరంలో పాద‌యాత్రలో న‌డిచింది. త‌మ‌కు స్థానికంగా ఉద్యోగాలు క‌ల్పించిన కియా తీసుకొచ్చినందుకు చంద్రబాబు గారికి అభినంద‌న‌లు తెలియ‌జేసింది.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో బీసీలకు ఇచ్చిన హామీల అమలు!

టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు ఇచ్చిన హామీలను యేడాదిలోనే అమలు చేస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. పెనుగొండ నియోజకవర్గం పాలసముద్రం క్రాస్ వద్ద బీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... బీసీల పక్షపాత ప్రభుత్వమని చెప్పుకుంటున్న జగన్ ఒక్కో వర్గాన్ని నమిలేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 

"నాడు- నేడు ఎప్పుడైనా బీసీలకు అండగా ఉండేది టీడీపీనే. ఎన్నికల సమయం వచ్చే సరికి జగన్ పనికిమాలిన సమ్మిట్ పెట్టారు. కియా సంస్థ ఇక్కడికి వస్తుంటే దొంగ సంస్థ అని జగన్ ఆనాడు విమర్శించారు. కియాకు ఇచ్చిన భూములు రైతులకు ఇప్పిస్తామని జగన్ అన్నారు. కానీ కియాలో నేడు 25 వేల మంది పని చేస్తున్నారు. కియా అనుబంధ సంస్థలు వచ్చి ఉంటే లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేవి. ఎంపీ మాధవ్ కియా వాళ్లను బెదిరించారు" అని ఆరోపించారు.

యాదవులకు అండగా నిలచింది టీడీపీనే!

యాదవ సామాజిక వర్గానికి రాజకీయంగా పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీయేనని నారా లోకేశ్ పేర్కొన్నారు. పెనుగొండ నియోజకవర్గం నల్లగొండ్రాయనిపల్లిలో యాదవ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... టీడీపీ హయాంలో కేవలం యాదవుల కోసం రూ.250 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 

"నాడు ఆర్ధిక శాఖ మంత్రి, టీటీడీ ఛైర్మన్, తుడా ఛైర్మన్, ఏపీఐఐసి ఛైర్మన్ పదవులు యాదవులకు ఇచ్చింది టీడీపీ. ఇప్పుడు ఆ పదవుల్లో ఎవరు ఉన్నారో యాదవ సోదరులు ఒక్క సారి ఆలోచించాలి. జగన్ పాలనలో జరిగింది సామాజిక అన్యాయం మాత్రమే. యాదవ కార్పొరేషన్ ని జగన్ నిర్వీర్యం చేశారు. ఒక్క గొర్రె కొనడానికి రుణం ఇవ్వలేదు. పాడి పరిశ్రమను నాశనం చేశాడు జగన్. గోపాల మిత్ర వ్యవస్థను జగన్ చంపేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే గొర్రెలకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం, పాడి పరిశ్రమకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తాం. యాదవ కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం" అని వెల్లడించారు.

లోకేశ్ ను కలిసిన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు

పెనుకొండ నియోజకవర్గం గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ లో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అసోసియేషన్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు లోకేశ్ ను కలిసి సమస్యలు విన్నవించారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సీపీఎస్ రద్దుపై అనేకసార్లు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులందరిని నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న తమపై కక్షసాధింపు చర్యలకు దిగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ.... డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దేశచరిత్రలో ఉపాధ్యాయులను మద్యం షాపులవద్ద కాపలా పెట్టింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఘాటు విమర్శలు చేశారు. "పాఠశాలల్లో టీచర్లకు పోలీసులను కాపలాపెట్టి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సమయానికి జీతాలు చెల్లించలేని దివాలాకోరు ప్రభుత్వం... రకరకాల సాకులతో వారిని ఇబ్బందులకు గురిచేయడం దారుణం. 

రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ 43 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్ సీ ఇచ్చిన ఘనత చంద్రబాబునాయుడుది. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేసే ఉద్యోగులు, భావి భారత పౌరులను తయారుచేసే టీచర్లు తమ డిమాండ్ల కోసం చేసే పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తాం" అని భరోసా ఇచ్చారు. 

లోకేశ్ పాదయాత్రకు న్యాయవాదుల సంఘీభావం

పెనుకొండ నియోజకవర్గం పాలసముద్రం క్రాస్ వద్ద శ్రీసత్యసాయి జిల్లా న్యాయవాదులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ... రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయవ్యవస్థపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టులోని కప్పు కాఫీ దొరికే పరిస్థితిలేదని ఓ న్యాయమూర్తి వ్యాఖ్యానించడం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోందని తెలిపారు. 

"రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువ న్యాయవాదుల నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాం, న్యాయవాదులకు రాయితీపై ఇళ్లస్థలాలు కేటాయిస్తాం" అని హామీ ఇచ్చారు.


*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 676.5 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 15.1 కి.మీ.*

*54వరోజు (29-3-2023) యువగళం పాదయాత్ర వివరాలు:*

*పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం*

ఉదయం

8.00 – నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రంలో బ్రాహ్మణ సామాజికవర్గీయులతో భేటీ, అనంతరం పాదయాత్ర ప్రారంభం.

8.25 – సోమందేపల్లి దళితవాడలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

8.50 – సోమందేపల్లిలో మహిళలతో భేటీ.

9.20 – సోమందేపల్లి ఎన్టీఆర్ సర్కిల్ లో చేనేతలతో సమావేశం.

10.30 – వెంకటాపురం తండాలో స్థానికులతో మాటామంతీ.

మధ్యాహ్నం 

12.35 – పెనుకొండ ఆర్చి వద్ద స్థానికులతో మాటామంతీ.

1.00 – పెనుకొండ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ లో వ్యాపారులతో సమావేశం.

2.00 – పెనుకొండ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ లో భోజన విరామం.

సాయంత్రం

3.00 – పెనుకొండ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ లో కురుబ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

4.00 – పెనుకొండ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ నుంచి పాదయాత్ర కొనసాగింపు.

8.00 – పెనుకొండ క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.


More Telugu News