Allu Arjun: తొలి సినిమాకు 20 ఏళ్లు.. స్పందించిన అల్లు అర్జున్

  • 2003 మార్చి 28న రిలీజైన గంగోత్రి
  • ట్విట్టర్ లో స్పందించిన అల్లు అర్జున్
  • తనను ఆశీర్వదించి.. ప్రేమతో ముంచెత్తారని వ్యాఖ్య
allu arjun completed 20 years in cine industry

20 ఏళ్ల కిందట ఇదే రోజున ‘గంగోత్రి’ అనే సినిమా విడుదలైంది. అందులో ఉన్న హీరో ఎవరనేది చాలా మంది సాధారణ సినీ ప్రేక్షకులకు తెలియదు. ‘చిరంజీవి మేనల్లుడట’.. అల్లు అరవింద్ గారి అబ్బాయట.. అని మాత్రమే తెలుసు. వెళ్లారు. చూశారు. కథ నచ్చింది.. పాటలు బాగున్నాయి.. సినిమా హిట్ అయింది.  

ఆ తర్వాత ఆర్య, బన్నీ, పుష్ప అంటూ పేర్లనే బ్రాండ్లుగా మారుస్తూ వచ్చాడు. తగ్గేదే లే.. ద్యావుడా.. గమ్మునుండవోయ్.. అంటూ మేనేరిజంతో ట్రెండ్ సెట్ చేస్తూ వచ్చాడు. వస్తున్నాడు. వస్తూనే ఉన్నాడు.

అతడే అల్లు అర్జున్. గంగోత్రితో మొదలుపెట్టి, పుష్ప దాకా ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఒక్కో సినిమాతో ఒక్కో స్టైల్ ను మెయింటైన్ చేస్తూ.. తన హవాను కొనసాగిస్తున్న బన్నీ ఇండస్ట్రీలోకి వచ్చి ఈ రోజుకు 20 ఏళ్లయింది. ఈ సందర్భాన్ని ఆయన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. 

‘‘ఈ రోజుతో నేను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా. నన్ను ఆశీర్వదించారు. ప్రేమతో ముంచెత్తారు. సినీ పరిశ్రమకు చెందిన నా వారందరికీ నేను కృతజ్ఞుడిని. ప్రేక్షకులు, ఆరాధకులు, అభిమానుల ప్రేమ వల్లే నేనిలా ఉన్నా. ఎప్పటికీ కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా ఏడాదిన్నర కిందట పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ‘తగ్గేదేలా’.. ‘పుష్ప అంటూ ఫ్లవర్ అనుకుంటివా.. ఫయరు’ అంటూ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ జరుగుతోంది. రెండో భాగం కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండో భాగం ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో?

More Telugu News