ChatGPT: వావ్..డాక్టర్లు కూడా చేయలేనిది చేసి చూపించిన చాట్‌జీపీటీ

  • సోషల్ మీడియాలో కుక్క యజమాని పెట్టిన పోస్ట్ వైరల్
  • పెంపుడు కుక్కకు ఉన్న వ్యాధిని చాట్‌జీపీటీ కచ్చితంగా గుర్తించిందన్న నెటిజన్
  • సమయానికి ట్రీట్‌మెంట్ అందడంతో కుక్క కోలుకుందని వెల్లడి
ChatGPT saves life of dog diagnoses problem that even vet could not identify

రోగుల ప్రాణాలను కాపాడే వైద్యులను సాధారణంగా భగవంతుడితో పోలుస్తారు. కానీ.. వైద్యులు కూడా మనుషులే కాబట్టి మానవసహజమైన పరిమితులు వారికీ ఉంటాయి. కానీ.. తనకు అటువంటి పరిమితులేవీ లేవని నిరూపించిన చాట్‌జీపీటీ తాజాగా సుశిక్షితులైన వైద్యులు చేయలేనిది చేసి చూపించింది. ఓ శునకానికి ఉన్న వ్యాధి ఏంటో కచ్చితంగా గుర్తించి దాని ప్రాణాలు కాపాడింది. తన పెంపుడు శునకం ప్రాణాలు కాపాడిన చాట్‌జీపీటీకి ధన్యవాదాలు చెబుతూ కూపర్ అనే వ్యక్తి ప్రస్తుతం నెట్టింట్లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.

కూపర్ పెంచుకుంటున్న ఓ కుక్క ఇటీవల అనారోగ్యం పాలైంది. అకస్మాత్తుగా దాని ఆరోగ్యం మరింత దిగజారింది. తొలుత కుక్క ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు అనిపించినా అంతలో దిగజారడం ప్రారంభించింది. అయితే.. ఇందుకు కారణమేంటో వెటర్నరీ వైద్యులు గుర్తించలేకపోయారు. కూపర్ అనేక మందిని సంప్రదించినా ఉపయోగం లేకపోయింది. దీంతో..ఆయన చివరకు చాట్‌జీపీటీని ఆశ్రయించారు. తన కుక్కకు ఉన్న రోగ లక్షణాలు, అప్పటివరకూ చేసిన వైద్య పరీక్షల తాలుకు ఫలితాలను చాట్‌బాట్ ముందుంచారు. 

అన్ని విషయాలను పరిశీలించాక కుక్కకు ఇమ్యూన్ మీడియేటెడ్ హీమోలైటిక్ అనీమియా వ్యాధి ఉన్నట్టు చాట్‌జీపీటీ అభిప్రాయపడింది. ఈ సమాచారంతో కూపర్ వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించారు. దీంతో..వైద్యుడికి కూడా శునకానికి ఉన్న సమస్య గురించి మరింత స్పష్టత వచ్చింది. ఆ తరువాత ఆయన ఇచ్చిన ట్రీట్‌మెంట్‌తో కుక్క పూర్తిగా కోలుకుంది. ఈ విషయాలన్నీ వివరిస్తూ కూపర్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా వృత్తినిపుణుల చేసే అనేక పనులను చాట్‌జీపీటీ చిటికలో సమర్థవంతంగా చేస్తుండటంతో భవిష్యత్తులో అనేక ఉద్యోగాలు కనుమరుగు అవుతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 


More Telugu News