VH: తాను కాంగ్రెస్ లో చేరలేదన్న డీఎస్... ఇదేం లొల్లి అంటూ వీహెచ్ అసహనం

  • నిన్న కుమారుడితో పాటు గాంధీభవన్ కు వచ్చిన డీఎస్
  • డీఎస్ కు కూడా పార్టీ కండువా కప్పిన కాంగ్రెస్ నేతలు
  • తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ ఖర్గేకు లేఖ రాసిన డీఎస్
  • రాహుల్ గాంధీ బాధలో మేముంటే ఈ పంచాయితీ ఏంటన్న వీహెచ్
VH comments on DS issue

సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) తనయుడు డి.సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తనయుడి వెంట డీఎస్ కూడా కాంగ్రెస్ లోకి వచ్చారని కథనాలు వచ్చాయి. దీనిపై డీఎస్ స్పందించారు. తాను కాంగ్రెస్ లో చేరినట్టు వస్తున్న వార్తలను ఖండించారు. 

తన చిన్న కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడని, ఆ సందర్భంగా తనకు కూడా కండువా కప్పారని, కానీ తాను పార్టీలో చేరలేదని డీఎస్ స్పష్టం చేశారు. తాను పార్టీలో చేరినట్టు భావిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి డీఎస్ లేఖ రాశారు. ఆ లేఖలో తన భార్య విజయలక్ష్మిని సాక్షిగా పేర్కొన్నారు. 

తన భర్త డీఎస్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని విజయలక్ష్మి వెల్లడించారు. ఆయన గతంలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేశారని, ఆయనను రాజకీయాల కోసం వాడుకోవద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు దయ ఉంచి ఇటువైపు రావొద్దని, తన భర్తను ప్రశాంతంగా ఉండనివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 

దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అసహనం వ్యక్తం చేశారు. డీఎస్ ను తాము రమ్మని చెప్పలేదని, ఢిల్లీకి వెళ్లి ఆయనే పార్టీలో చేరుతున్నట్టు చెప్పాడని వెల్లడించారు. పార్టీలోకి వస్తానంటే మానవతా దృక్పథంతో ఆహ్వానించామని తెలిపారు. కానీ ఇప్పుడిలా మాట్లాడడం సరికాదని అన్నారు. 

"మా ప్రాబ్లంలో మేముంటే ఇదేంది లొల్లి! పార్టీలో చేరడం లేదని డీఎస్ నిన్ననే చెబితే సరిపోయేది కదా! మీ కుటుంబంలో సమస్య ఉంటే మీరు మీరు మాట్లాడుకోవాలి. ఓపక్క రాహల్ గాంధీ విషయంలో మేం బాధపడుతుంటే మధ్యలో మీ పంచాయితీ ఏంటి?" అని వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు. 

More Telugu News