KL Rahul: బీసీసీఐ కాంట్రాక్టుల్లో బి గ్రేడ్ కు పడిపోయిన కేఎల్ రాహుల్

  • వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ
  • గతంలో ఎ గ్రేడ్ లో ఉన్న కేఎల్ రాహుల్
  • పేలవ ఫామ్ తో సతమతం
  • ఎ గ్రేడ్ నుంచి ఎ ప్లస్ కు ఎగబాకిన జడేజా
  • సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో స్థానం కోల్పోయిన హనుమ విహారి 
KL Rahul down grades in BCCI central contracts

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియా ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులు ప్రకటించింది. ఎ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్లు, ఎ గ్రేడ్ ఆటగాళ్లకు 5 కోట్లు, బి గ్రేడ్ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, సి గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ.1 కోటి ఇస్తారు. 

పేలవ ఫామ్ తో సతమతమవుతున్న కేఎల్ రాహుల్ సెంట్రల్ కాంట్రాక్టుల్లో బి గ్రేడ్ కు పడిపోయాడు. గతంలో రాహుల్ ఎ గ్రేడ్ లో ఉన్నాడు. తాజా ప్రకటన అనంతరం బి గ్రేడ్ లో రాహుల్ తో పాటు శ్రేయాస్ అయ్యర్, శుభ్ మాన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. 

ఇక, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఎ ప్లస్ కాంట్రాక్టులను నిలుపుకున్నారు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేశాక మాంచి ఊపుమీదున్న రవీంద్ర జడేజా ఎ నుంచి ఎ ప్లస్ కు ఎగబాకాడు. తాజా కాంట్రాక్టుల్లో జడేజా ఎ ప్లస్ జాబితాలో ఉన్నాడు. 

ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ సి కేటగిరీ నుంచి ఏకంగా ఎ కేటగిరీలోకి రాగా... ప్రస్తుతం సి కేటగిరీలో శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, యజువేంద్ర చహల్, ఉమేశ్ యాదవ్, అర్షదీప్ సింగ్, కేఎస్ భరత్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, దీపక్ హుడా ఉన్నారు. 

కాగా, తెలుగుతేజం హనుమ విహారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో స్థానం కోల్పోయాడు. భువనేశ్వర్ కుమార్, వృద్ధిమాన్ సాహా, అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, దీపక్ చహర్, మయాంక్ అగర్వాల్ కూడా కాంట్రాక్టుల జాబితాలో స్థానం కోల్పోయారు.

More Telugu News