భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

  • ఆంధ్రా యూనివర్సిటీలో కొత్తగా సౌండ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ సర్టిఫికెట్ కోర్సు
  • అత్యాధునిక సౌకర్యాలతో మ్యూజిక్ ప్రొడక్షన్ స్టూడియో నిర్మాణం
  • ప్రారంభోత్సవంలో పాల్గొన్న తమన్
  • విశ్రాంత జీవితాన్ని విశాఖలో గడపాలనుకుంటున్నానని వెల్లడి
Thaman inaugurates music production studio in Andhra University

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో కొత్తగా సౌండ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ సర్టిఫికెట్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. అందుకోసం ఆంధ్రా యూనివర్సిటీ, సెయింట్ లుక్స్ సంస్థ సంయుక్తంగా ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ స్టూడియోను ఏర్పాటు చేశాయి. ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి టాలీవుడ్ అగ్రశ్రేణి సంగీత దర్శకుడు తమన్ విచ్చేశారు. ఏయూ వీసీ ప్రసాదరెడ్డితో కలిసి స్టూడియోను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ, ఏపీలో ఎంతోమంది సుప్రసిద్ధ కవులు, సంగీతకారులు, నటులు, కళాకారులు జన్మించారని, ఇక్కడి భాష, యాస తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని తెలిపారు. విశాఖలో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇంత భారీ స్టూడియోను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. 

భీమిలిలో ఓ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని తమన్ వెల్లడించారు. విశ్రాంత జీవితాన్ని విశాఖ నగరంలో ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నానని తెలిపారు. తమన్ నిన్న రాత్రి విశాఖలో జరిగిన సీసీఎల్ టోర్నీ ఫైనల్లో తెలుగు వారియర్స్ జట్టు తరఫున ఆడిన సంగతి తెలిసిందే.

More Telugu News