టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

  • ఇటీవల ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
  • టీడీపీ అభ్యర్థి విజయం
  • క్రాస్ ఓటింగ్ జరిగిందని నిర్ధారించిన వైసీపీ
  • నలుగురిపై వేటు
  • తమ ఓట్లు కొన్నారంటూ టీడీపీపై ఆరోపణలు
  • ఓటు వేస్తే ఫైనాన్షియల్ గా చూసుకుంటామన్నారని రాపాక వెల్లడి
Rapaka Varaprasad sensational comments

ఇటీవల ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం తెలిసిందే. మొత్తం 7 ఖాళీలకు ఎన్నికలు జరగ్గా, వైసీపీకి 6, టీడీపీకి 1 దక్కాయి. నలుగురు అసమ్మతి ఎమ్మెల్యేలు పోను   టీడీపీకి  19 మంది  ఎమ్మెల్యేలు  ఉండగా, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు పడ్డాయి. దాంతో, అవతలి పక్షం నుంచి 4 ఓట్లు పడినట్టు స్పష్టమైంది. ఈ క్రమంలో వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. 

ఈ నేపథ్యంలో, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని తనను సంప్రదించారని వెల్లడించారు. "అంతర్వేదిలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి నన్ను కూడా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఓ మాట అన్నాను. పార్టీలో అవినీతికి పాల్పడకూడదు... నీతి నిజాయతీతో పనిచేయాలని అన్నాను. ఒకవేళ అక్రమాలకు పాల్పడాలి అనుకుని ఉంటే మొన్న నా ఓటు మరొకరికి వేసి ఉంటే రూ.10 కోట్లు వచ్చి ఉండేవి అన్నాను. 

టీడీపీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది. ఇన్ని కోట్లు అని కాదు కానీ... పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఫైనాన్షియల్ గా కూడా మాట్లాడదాం అని ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు నాతో అన్నారు. అయితే ఆ ఆఫర్ ను నేను వెంటనే తిరస్కరించాను. నేను క్రాస్ ఓటింగ్ చేయను... ఇలాంటివి నాతో మాట్లాడొద్దు అని ఆయనకు స్పష్టం చేశాను. 

నా మిత్రుడు కేఎస్ఎన్ రాజు అని వైసీపీలో నాయకుడిగా ఉన్నాడు. మీ ఎమ్మెల్యే ఓటు వేస్తే మేం అన్ని రకాలుగా చూసుకుంటాం అని అతడిని కూడా అడిగారు. మా ఎమ్మెల్యే అలాంటివాడు కాదు, ఆయనతో ఈ ఆఫర్ విషయం నేను చెప్పను అని స్పష్టం చేశాడు. ఇది జరిగిన తర్వాత ఉండి ఎమ్మెల్యే నేరుగా నన్ను సంప్రదించగా, క్రాస్ ఓటింగ్ చేసేది లేదని నేను కరాఖండీగా చెప్పేశాను" అని రాపాక వరప్రసాద్ వివరించారు.

More Telugu News