పెట్టని కోటలా ఢిల్లీ బ్యాటింగ్.. ఆల్ రౌండర్లతో బలంగా ముంబై.. తొలి కప్పు గెలిచేదెవరో.. డబ్ల్యూపీఎల్ ఫైనల్ నేడే!

  • తుది దశకు చేరుకున్న డబ్ల్యూపీఎల్‌ 
  • ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఫైనల్
  • రాత్రి 7.30 నుంచి మ్యాచ్ మొదలు
wpl final mumbai indians take on delhi capitals for inaugural title

నెలరోజులపాటు క్రికెట్ అభిమానులను అలరించిన మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌) తుది అంకానికి చేరుకుంది. తొలి సీజన్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. లీగ్ దశలో అదరగొట్టిన ముంబై, ఢిల్లీ జట్లే తుదిపోరుకు చేరుకున్నాయి. 

లీగ్‌ దశలో పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నేరుగా ఫైనల్ కు అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ ను చిత్తుగా ఓడించి ముంబై ఇండియన్స్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. సమ ఉజ్జీలుగా నిలిచిన ఈ జట్ల మధ్య హోరాహోరీ సమరం ఖాయమే.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమతూకంగా ఉంటే.. ఆసీస్ దిగ్గజం మెగ్ లానింగ్ లీడ్ చేస్తున్న ఢిల్లీ టాప్ ఆర్డర్ పెట్టని కోటలా బలంగా ఉంది. ముంబై టీమ్ లో హీలీ మాథ్యూస్‌, స్కీవర్‌ బ్రంట్‌, అమెలియా కెర్‌, పూజా వస్త్రాకర్‌, ఇస్సి వాంగ్‌, సైకా ఇషాఖ్‌ వంటి ఆల్ రౌండర్లతో ముంబై పటిష్టంగా కనిపిస్తోంది. ఇటు ఢిల్లీ టీమ్ లో కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌తో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, మరినె కాప్‌, కాప్సీ, జాన్సెన్‌తో ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ శత్రుదుర్భేద్యంగా ఉంది.

బలాబలాల పరంగా ఇరుజట్లు సమానంగా కనిపిస్తున్నాయి. ఒత్తిడిని జయించి ఎవరు తొలి టైటిల్‌ చేపడతారో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. రాత్రి 7.30కి మ్యాచ్ మొదలవుతుంది. స్టే ట్యూన్డ్!

More Telugu News