పార్టీ ‘భాష’నే మాట్లాడా.. 2018 నాటి ‘మోదీ’ ట్వీట్ పై ఖుష్బూ!

  • 2020లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఖుష్బూ
  • మోదీ పేరును ‘అవినీతి’గా మార్చేద్దామంటూ గతంలో విమర్శలు
  • రాహుల్ పై అనర్హత వేటు నేపథ్యంలో ఆమె ట్వీట్ వైరల్
  • ఆ ట్వీట్‌పై తానేం సిగ్గుపడటం లేదంటూ ఖుష్బూ కౌంటర్
  • కాంగ్రెస్ పార్టీ ఎంత నిరాశలో ఉందో తెలుస్తోందని ఎద్దేవా
As BJP Leader Khushbu Sundars Old Tweet On PM Goes Viral and here what she says

ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారడం అనేది రాజకీయాల్లో సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఒకేరోజూ మూడు పార్టీలు మారిన నేతలు కూడా ఉన్నారు. అయితే తీవ్రంగా విమర్శించిన పార్టీలోకే ఎవరైనా చేరితే.. పాత వీడియోలు, ట్వీట్లు, పోస్టులను గుర్తు చేస్తూ విపక్ష నేతలు ప్రశ్నిస్తుంటారు. 

గతంలో కాంగ్రెస్ లో ఉండి.. ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్న ఖుష్బూ సుందర్ పరిస్థితి కూడా ఇదే. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు ఖుష్బూ. ‘‘ఇక్కడ మోదీ.. అక్కడ మోదీ.. ఎక్కడ చూసినా మోదీనే.. అసలేంటిది?? ప్రతి మోదీ వెనుక భ్రష్టాచార్‌ అనే ఇంటి పేరు పెట్టాలి. మోదీ అంటేనే అవినీతి. మోదీ పేరును అవినీతిగా మార్చేద్దాం. అదే సరిగ్గా సరిపోతుంది. నీరవ్‌, లలిత్‌, నమో : అవినీతి’’ అంటూ 2018లో ట్వీట్‌ చేశారు. అయితే 2020లో బీజేపీలో చేరారు. కానీ ఆ ట్వీట్ ను డిలీట్ చేయలేదు.

రాహుల్ పై అనర్హత వేటు నేపథ్యంలో ఖష్బూ ట్వీట్ వైరల్ అవుతోంది. ఖుష్బూపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.  ‘మోదీ’ ఇంటి పేరును అవినీతిగా పేర్కొన్న సుందర్‌పై పరువు నష్టం కేసు వేస్తారా..? అంటూ దిగ్విజయ్ సింగ్ నిలదీశారు.

దీంతో తనపై వస్తున్న విమర్శలకు ఖుష్బూ కౌంటర్ ఇచ్చారు. పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆమె.. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ భాషలోనే మాట్లాడానని చెప్పారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో పోస్ట్ చేసిన ‘మోదీ’ ట్వీట్‌కు నేను సిగ్గుపడటం లేదు. నేను నాయకుడిని అనుసరించాను. ఆ పార్టీ భాషనే మాట్లాడాను. ఇప్పుడు నా పేరును తెరపైకి తీసుకురావడం ద్వారా.. రాహుల్ తో నేను సమానమని కాంగ్రెస్ నేతలు చెప్పదలుచుకున్నారా?’’ అని ప్రశ్నించారు. ధైర్యముంటే తనపై కేసు పెట్టుకోవాలని సవాల్ చేశారు. పాత ట్వీట్ గురించి ఇప్పుడు మాట్లాడటం చూస్తే.. కాంగ్రెస్ పార్టీ ఎంత నిరాశలో ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు.

More Telugu News