Nara Lokesh: ​చంద్రబాబు రాజకీయం ముందు జగన్ ఎంతటివాడు?: నారా లోకేశ్

  • లోకేశ్ పాదయాత్రకు 50వ రోజు
  • పుట్టపర్తి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • ఓబులదేవచెరువులో లోకేశ్ స్పీచ్
  • చంద్రబాబు దెబ్బకు జగన్ గిలగిలా కొట్టుకుంటున్నాడని వ్యాఖ్య 
Lokesh take swipe at YS Jagan

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 50వ రోజు పుట్టపర్తి నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగింది. లోకేశ్ పాదయాత్రకు దారి పొడవునా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎదురేగి స్వాగతం పలుకుతూ తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఓబులదేవచెరువులో పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. మహిళలు అడుగడుగునా హారతులు ఇస్తూ నీరాజనాలు పలికారు. తనను చూసేందుకు వచ్చిన వారందరిని యువనేత ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగుతూ ముందుకుసాగారు. 

ఫిష్ ఆంధ్రా శాశ్వతంగా ఫినిష్ అయినట్లేనా?

ఓబులదేవచెరువులో మూసివేసి ఉన్న ఫిష్ ఆంధ్ర మార్ట్ వద్ద లోకేశ్ సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగితే గడ్డిమేటు అడ్డొచ్చింది అంద‌ట‌... అట్టా ఉంది మ‌న జ‌గ‌న్ రెడ్డి చేప‌ల బ‌జార్ల తీరు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"చేప‌ల దుకాణం ఎందుకు తెరవడంలేదంటే... స‌వాల‌క్ష కార‌ణాలు. బులుగు రంగులు వేయ‌డంలో ఉన్న శ్రద్ధ ఫిష్ ఆంధ్ర దుకాణాల నిర్వహ‌ణ‌లో ఉంటే బాగుండేది. ఓబుల‌దేవ‌చెరువులో క్లోజ్ అయిన ఫిష్ ఆంధ్ర మార్ట్ జగన్ రెడ్డి పనితనానికి నిదర్శనం. గ‌తంలో చిత్తూరుజిల్లాలో ఫిష్ ఆంధ్ర మూత‌పడడంపై ఓ సెల్ఫీతో ప్రశ్నించాను. మౌనం అర్దాంగీకారం అనుకోవ‌చ్చా? ఫిష్ ఆంధ్ర శాశ్వతంగా ఫినిష్ అయిన‌ట్టేనా? అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు దెబ్బకు జగన్ గిలగలా!

ఓబులదేవచెరువు రెయిన్ బో ఎడ్యుకేషన్ అకాడమీ వద్ద ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ప్రసంగించారు. యువగళం దెబ్బ అదుర్స్ కదా జగన్ రెడ్డీ... అంటూ  వ్యాఖ్యానించారు. "స్టూడెంట్ లీడర్ గా ఎదిగిన చంద్రబాబు ముందు టెన్త్ ఫెయిల్ అయిన జగన్ కుప్పిగంతులు వేశాడు. లాగిపెట్టి ఒకటి కొడితే కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు... ఆయన రాజకీయం ముందు నువ్వెంత జగన్... నువ్వు అమూల్ బేబీ!" అంటూ ఎద్దేవా చేశారు. 

సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ ని నమ్మడం లేదని అన్నారు. ఆఖరికి పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్ ని నమ్మడం లేదని తెలిపారు. "అందరికీ అర్ధం అయిపోయింది ఆయన జగన్ మోహన్ కాదు మోళీ మోహన్ అని. నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం... తాడేపల్లి ప్యాలెస్ లో నిన్న ఎన్ని టీవీలు పగిలాయో...! అహంకారంతో వెంట్రుక కూడా పీకలేరు అన్నాడు... ఏకంగా ప్రజలు గుండు కొట్టించి పంపేశారు. 

మాకు అన్నీ గుర్తున్నాయి, అట్టుకు అట్టున్నర పెడతాం, జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం చేస్తాం. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. అధికారపార్టీ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడేవారికి టీడీపీ అధికారంలోకి వచ్చాక పెద్దపీట వేస్తాం. ఎవరూ కేసులకు భయపడాల్సిన పనిలేదు" అని భరోసా ఇచ్చారు.

జగన్ వద్ద రివర్స్ బటన్ కూడా ఉంది!

జగన్ వద్ద రెండు బటన్స్ ఉంటాయి... ఒక బటన్ నొక్కగానే సంక్షేమ కార్యక్రమాల పేరుతో మీ అకౌంట్ లో 10 రూపాయిలు పడతాయి. అదే బల్ల కింద రివర్స్ బటన్ ఉంటుంది అది నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయిలు జగన్ ఖాతాలోకి వెళ్లిపోతాయి అని లోకేశ్ వివరించారు. 

"ఎలా వెళ్తాయో కూడా నేను చెబుతా. కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ నంబర్ 1. ఇంటి పన్ను రెట్టింపు చేశాడు, చెత్త పన్ను వేశాడు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇదే రివర్స్ బటన్" అని వివరించారు.

సత్యసాయి ప్రాజెక్టును దత్తత తీసుకుంటా!

సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయ్యి అనేక గ్రామాలకు త్రాగునీరు అందించే పథకాన్ని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిందని లోకేశ్ విమర్శించారు. "కనీసం విద్యుత్ బిల్లులు కట్టడం లేదు, కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని సక్రమంగా నడిపించి గ్రామాలకు త్రాగునీరు అందిస్తాం. ఈ ప్రాజెక్టును నేను దత్తత తీసుకుంటాను. అనంతపురంలో ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు అందించే బాధ్యత నాది" అని స్పష్టం చేశారు. 

దుద్దుకుంట కాదు... దోపిడీగుంట శ్రీధర్ రెడ్డి!

పుట్టపర్తి ఎమ్మెల్యే పేరు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఆయన ప్రజా ధనం దోపిడీలో దిట్ట. అందుకే ఆయన పేరు మార్చాను దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి. దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి గారు ఆయన అనుచరులు కలిసి ఆధ్యాత్మిక కేంద్రాన్ని అరాచక కేంద్రంగా మార్చేశారు. పుట్టపర్తిలో ఓ బిల్డర్ ను బెదిరించి కోటిన్నర రూపాయాలు వసూలు చేశారు. ఓబులదేవచెరువు మండలంలో టీచర్లంతా కలిసి ఏర్పాటు చేసుకున్న లేఅవుట్ కోసం కోటి రూపాయలు తీసుకున్నారు. కొత్తచెరువు వద్ద ఓ లేఅవుట్ కు దారి కోసం నిర్మించిన బ్రిడ్జి అనుమతి కోసం 75 లక్షలు వసూలు చేశారు. 

పుట్టపర్తిలో ఈ ఎమ్మెల్యే చేసిన అరాచాకాలు, అక్రమాలు చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోతుంది. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేస్తారని ముందుగానే తెలుసుకుని టౌన్ చుట్టుపక్కల అతి తక్కువ ధరకు వందల ఎకరాలు కొన్నారు. భూ వివాదాలు వీరే సృష్టిస్తారు. తర్వాత వాటిని పరిష్కరించినట్టు కలరింగ్ ఇచ్చి కమీషన్ రూపంలో లక్షలు కొట్టేస్తారు. నాలుగేళ్లలో వందల కోట్లు అక్రమంగా సంపాదించారు. 


*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 636.1 కి.మీ.

ఈరోజు నడిచిన దూరం 11.1 కి.మీ.

51వరోజు (26-3-2023) యువగళం పాదయాత్ర వివరాలు:

ఉదయం

8.00 – రామయ్యపేట విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.30 – రామయ్యపేటలో మహిళా ప్రముఖులతో సమావేశం.

10.40 – అల్లపల్లిలో ఆటోవర్కర్లతో భేటీ.

11.20 – గౌనిపల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

మధ్యాహ్నం

12.15 – పగడాలవారిపల్లిలో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

1.15 – పగడాలవారిపల్లిలో భోజన విరామం.

2.30 – భోజన విరామస్థలంలో యువతతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – యువగళం పాదయాత్ర పెనుగొండ నియోజకవర్గంలోకి ప్రవేశం.

5.00 – గౌనివారిపల్లి (గోరంట్ల మండలం)లో స్థానికులతో మాటామంతీ.

5.35 – కొరెవాండ్లపల్లిలో స్థానికులతో సమావేశం.

6.30 – కొండాపురం పంచాయితీ రెడ్డిచెరువుకట్ట విడిది కేంద్రంలో బస.


More Telugu News