Congress: నిషేధానికి భయపడను.. పోరాటం ఆపను: అనర్హత వేటుపై రాహుల్ గాంధీ

Congress Leader Rahul Gandhi press meet about his disqualification in parliament
  • జీవితకాలం నిషేధించినా ప్రజాస్వామ్యం కాపాడేందుకు ఫైట్ చేస్తూనే ఉంటానన్న రాహుల్ 
  • జైల్లో పెట్టినా వెనక్కి తగ్గేదేలేదన్న కాంగ్రెస్ నేత
  • అదానీ వ్యవహారంపై ప్రశ్నించినందుకే తనపై వేటని విమర్శ 
  • 20 వేల కోట్ల విలువైన షెల్ కంపెనీలపై విచారణకు పట్టుబట్టానని వెల్లడి
  • ఆధారాలన్నీ స్పీకర్ కు సమర్పించినట్లు తెలిపిన రాహుల్ 
భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను పోరాడుతూనే ఉంటానని, పదవుల నుంచి జీవితకాలం నిషేధించినా.. జైలులో పెట్టినా సరే పోరాటం ఆపబోనని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ లో తనపై విధించిన అనర్హత వేటుపై రాహుల్ మాట్లాడారు. తొలిసారిగా ఈ విషయంపై స్పందిస్తూ.. అదానీ వ్యవహారాలపై ప్రశ్నిస్తున్నందుకే తనపై వేటు పడిందని ఆరోపించారు. 

అదానికి, ప్రధాని మోదీకి మధ్య బంధం ఈనాటిది కాదని రాహుల్ చెప్పారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పటి నుంచే అదానీతో మితృత్వం కొనసాగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అదానీకి సంబంధించిన షెల్ కంపెనీల వివరాలను తాను బయటపెట్టడంతో మోదీ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. అదానీకి కట్టబెట్టేందుకు నిబంధనలను కూడా మార్చారని, ఎయిర్ పోర్టులను అక్రమంగా కట్టబెట్టారని రాహుల్ ఆరోపించారు.

అదానీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు ఎవరు పెట్టారని, వారి వివరాలను ప్రజల ముందు పెట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు. రూ.20 వేల కోట్ల విలువ ఉన్న ఈ షెల్ కంపెనీల వివరాలను ఆధారాలతో సహా స్పీకర్ కు అందించినట్లు తెలిపారు. ఈ డబ్బులు ఎవరివి? ఈ కంపెనీల వెనక చైనా జాతీయుడు ఒకరు ఉన్నారని తెలుస్తోంది.. అతడు ఎవరు? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు. ఇవన్నీ దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని రాహుల్ చెప్పారు.

బ్రిటన్ పర్యటనలో తాను చేసిన ప్రసంగంపై కేంద్ర మంత్రులు తప్పుడు ప్రచారం చేశారని రాహుల్ ఆరోపించారు. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు సభలో నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని, స్పీకర్ ను అడిగితే నవ్వుతూ కుదరదని చెప్పారని మండిపడ్డారు. తాను ఎవరికీ భయపడబోనని, ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా వెనుకడుగు వేయబోనని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ఆషామాషీగా తానేమీ మాట్లాడనని, తగిన రీసెర్చి చేసి, ఆలోచించాకే మాట్లాడతానని రాహుల్ చెప్పారు. ప్రధానిని కాపాడేందుకు తనపై అనర్హత వేటు, జైలు శిక్ష అంటూ డ్రామా జరుగుతోందని విమర్శించారు. ప్రస్తుతం  ప్రజల్లోకి వెళ్లడం మినహా విపక్షాలకు వేరే ప్రత్యామ్నాయం లేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.
Congress
Rahul Gandhi
press meet
Rahul Reaction
New Delhi
Gautam Adani
PM modi

More Telugu News