Islamic preacher: హిందువులు నన్ను ఎంతో ప్రేమిస్తారు.. అదే సమస్య: జకీర్ నాయక్

Hindus in India love me so much that Islamic preacher Zakir Naik in Oman
  • అది ఓటు బ్యాంకు సమస్యను సృష్టిస్తోందని వ్యాఖ్య
  • తన ప్రసంగాలకు పెద్ద ఎత్తున హిందువులు వస్తారన్న జకీర్
  • జకీర్ ను భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్న విదేశాంగ శాఖ
పరారీలో ఉన్న ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ ఒమన్ లో చేసిన ప్రసంగంలో హిందువుల గురించి ప్రస్తావించారు. తనకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థల వైఖరిని తప్పుబట్టారు. ‘ఖురాన్ అనేది ప్రపంచవ్యాప్త అవసరం’ అనే అంశంపై ఆయన ప్రసంగం చేశారు. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది.

‘‘భారత్ లో మెజారిటీ హిందువులు నన్ను ప్రేమిస్తారు. వారు నన్ను ఎంతగానో ప్రేమించడం వల్ల వోట్ బ్యాంకు సమస్యను సృష్టిస్తోంది. భారత్ లో నేను ప్రసంగం చేసినప్పుడు వేలాది మంది హాజరవుతారు. బీహార్, కిషన్ గంజ్ ప్రాంతాల్లో 20 శాతం ముస్లిమేతరులే ఉంటారు. ‘జకీర్ భాయ్ మీ రెండు గంటల ప్రసంగంలో నేర్చుకున్నది.. మా మతంలో 40 గంటలు విన్నా నేర్చుకోలేదు’ అని చెబుతుంటారు’’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

తన ప్రసంగాల్లో ఎలాంటి తప్పూ లేదని సిక్కు జడ్జి గుర్తించినట్టు చెప్పారు. 2018లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జకీర్ నాయక్ ఆస్తులను సీజ్ చేయబోయింది. దీన్ని ఢిల్లీలోని పీఎంఎల్ఏ అప్పిలేట్ ట్రిబ్యునల్ జడ్జిగా ఉన్న మన్మోహన్ సింగ్ అడ్డుకున్న విషయాన్ని జకీర్ నాయక్ వివరించారు. నాయక్ ప్రసంగంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఒక్క ప్రసంగాన్ని అయినా చూపించండంటూ ప్రభుత్వ న్యాయవాదిని జడ్జి అడిగినట్టు చెప్పారు.

జకీర్ నాయక్ ను తిరిగి భారత్ కు రప్పించి న్యాయపరమైన చర్యలు ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. జకీర్ అబ్దుల్ కరీమ్ నాయక్ (57) 2016లో దేశం విడిచి పరారయ్యారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ను కేంద్రం నిషేధించింది. బహిరంగ ప్రసంగాలు ఇవ్వకుండా జకీర్ పై మలేషియా సైతం నిషేధం విధించింది. ఆయనకు చెందిన పీస్ టీవీ నెట్ వర్క్ ను బంగ్లాదేశ్, కెనడా, శ్రీలంక, యూకే నిషేధించాయి.
Islamic preacher
Zakir Naik
Oman
Hindus
loved much

More Telugu News