ప్రమాదంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కు గాయం

  • టైగర్ ష్రాఫ్ తో బడే మియా ఛోటే మియాలో నటిస్తున్న అక్షయ్
  • స్కాట్లాండ్ లో యాక్షన్ సీక్వెల్స్ చిత్రీకరణ
  • ఆ సమయంలో మోకాలికి గాయమైనా షూటింగ్ లో పాల్గొంటున్న అక్షయ్
Akshay Kumar gets injured while shooting for an action sequence

బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ గాయపడ్డారు. విదేశాల్లో సినిమా షూటింగ్ లో యాక్షన్ సీక్వెల్స్ తెరకెక్కిస్తుండగా జరిగిన ప్రమాదంలో అక్షయ్ మోకాలికి గాయం అయింది. అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా ‘బడే మియా ఛోటే మియా’ అనే టైటిల్ తో హిందీ సినిమా తెరకెక్కుతోంది. ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సినిమాకు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం స్కాట్లాండ్ లో చిత్రీకరణ జరుపుకుంది. హీరోలిద్దరిపై యాక్షన్‌ సీక్వెల్స్ ను చిత్రీకరించారు. అయితే, స్టంట్స్‌ చేసే క్రమంలో అక్షయ్‌కుమార్‌ మోకాలికి దెబ్బతగిలింది. 

దాంతో, ప్రస్తుతానికి యాక్షన్ పార్టు చిత్రీకరణ వాయిదా వేశారు. మోకాలి గాయానికి అక్షయ్ చికిత్స తీసుకున్నారు. వైద్యులు ఆయనకు పట్టీ వేశారు. అయితే, స్కాట్లాండ్ షెడ్యూల్‌ను నిర్ణీత షెడ్యూల్ లో ముగించాలని అక్షయ్ గాయంతోనే షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయనపై మిగిలిన క్లోజప్‌ షాట్స్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లార్, అలాయ, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More Telugu News