USA: నన్ను అరెస్ట్ చేస్తే అమెరికాలో పెను విధ్వంసమే: ట్రంప్

  • హూష్ మనీ చెల్లింపులపై ట్రంప్ పై ఆరోపణలు
  • విచారణ జరుపుతున్న న్యాయ శాఖ అధికారులు
  • ట్రంప్ ను అరెస్టు చేస్తారంటూ ఇటీవల ప్రచారం
  • తనను అరెస్టు చేస్తే ఆందోళనలు చేయాలంటూ మద్దతుదారులకు ట్రంప్ పిలుపు
Donald Trump Says His Arrest Would Be Catastrophic For US

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ రిపబ్లికన్ల మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్నారు. అయితే, ట్రంప్ ను పోలీసులు అరెస్టు చేస్తారంటూ అమెరికాలో ప్రచారం జరుగుతోంది. తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయంగా ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఒకవేళ అదే జరిగితే ఆందోళనలు చేయాలంటూ మద్దతుదారులకు పిలుపునిచ్చారు. గతంలో ట్రంప్ ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నారని, ఆ విషయం బయట పెట్టకుండా ఆమెకు డబ్బులు ముట్టజెప్పారని (హూష్ మనీ) అమెరికా అధికారులు చెబుతున్నారు. పోర్న్ స్టార్ స్టోమీ డేనియల్స్ తో ట్రంప్ ఈ వ్యవహారం నడిపారని, దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు.

అరెస్టు వ్యవహారంపై మన్ హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ అల్విన్ బ్రాగ్ శుక్రవారం స్పందించారు. ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు తాము ఎలాంటి ప్రయత్నం చేయలేదని, ఆయనే తప్పుగా ఊహించుకుంటున్నారని చెప్పారు. ఈమేరకు రిపబ్లికన్ పార్టీ కమిటీ చైర్మన్ కు మన్ హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ కార్యాలయం నుంచి  ఓ లేఖ కూడా రాసింది. అరెస్టుకు సంబంధించిన ప్రచారమంతా ట్రంప్ ఊహేనని స్పష్టం చేశారు.

బ్రాగ్ ఆఫీస్ వివరణపై శనివారం ట్రంప్ స్పందించారు. తనను అరెస్ట్ చేస్తే అమెరికాలో పెను విధ్వంసం జరిగి ఉండేదని హెచ్చరించారు. ఓ మాజీ అధ్యక్షుడిని, అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించిన నేతను.. ఎలాంటి తప్పుచేయని వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారని ట్రంప్ ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలతో అదుపులోకి తీసుకుంటే దేశంలో కనీవినీ ఎరగని విధ్వంసం జరుగుతుందని ట్రంప్ హెచ్చరించారు.

More Telugu News