Rahul Gandhi: అప్పట్లో రాహుల్ అలా చేసి ఉండకపోతే.. ఇప్పుడీ అనర్హత వేటు పడేది కాదా?

  • 2013లో జరిగిన సంఘటనపై మరోమారు చర్చ
  • ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణల కోసం అప్పట్లో కాంగ్రెస్ ప్రయత్నం
  • కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై రాహుల్ అభ్యంతరం
  • దీంతో వెనక్కి తగ్గిన మన్మోహన్ సింగ్ సర్కారు
When Rahul Gandhi Tore Up Ordinance That Would Have Spared Him

పార్లమెంట్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడంతో 2013లో జరిగిన ఓ సంఘటనపై ఇప్పుడు మరోమారు చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ అప్పుడలా చేసి ఉండకపోతే ఇప్పుడు అనర్హత వేటు పడేదికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడీ అనర్హత వేటును రాహుల్ పదేళ్ల క్రితమే ఖాయం చేసుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అప్పుడేం జరిగింది.. ఇప్పుడు అనర్హత వేటుకు పదేళ్ల క్రితం జరిగిన సంఘటనకు లింక్ ఏమిటంటే..

2013 ఏప్రిల్ లో సుప్రీంకోర్టు ఓ సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏదైనా కేసులో రెండేళ్లు, ఆపైన జైలు శిక్ష పడితే సదరు ప్రజాప్రతినిధిపై అనర్హత వేటు పడుతుంది. కోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణమే ఆ ప్రజాప్రతినిధి తన పదవికి అనర్హుడిగా మారిపోతాడు. తీర్పుపై అప్పీల్ కు వెళ్లే అవకాశం ఆ ప్రజాప్రతినిధికి ఉంటుంది.

అయితే, ఇది అనర్హత వేటు పడకుండా రక్షణ కల్పించలేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ తీర్పు వెలువడిన 5 నెలల తర్వాత.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని ఈ నిబంధనను మార్చేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. దీనికోసం ఓ ఆర్డినెన్స్ తయారుచేసి, పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆర్డినెన్స్ ను అప్పటి ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్డినెన్స్ సరికాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఇది రాజకీయపరమైన నిర్ణయమని, ప్రతీ పార్టీ ఇలానే చేస్తుందని ఆరోపించారు. అయితే, ఈ చెత్త (నాన్సెన్స్) కు ఇక ఫుల్ స్టాప్ చెప్పాల్సిన సమయం వచ్చిందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ ఆర్డినెన్స్ ను చించి అవతల పడేయాలని పార్లమెంట్ లో కామెంట్ చేశారు.

ఆపై బయట మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సదరు ఆర్డినెన్స్ ప్రతిని నిజంగానే చించిపడేశారు. ఇలా ఆర్డినెన్స్ ప్రతిని చింపేయడంపై విమర్శలు వ్యక్తం కాగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంపై రెండు వర్గాలుగా విడిపోయింది. తర్వాత ఈ ఆర్డినెన్స్ పై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇందుకు రాహుల్ వ్యతిరేకత కూడా ఓ కారణమే!

అప్పట్లో ఆ ఆర్డినెన్స్ ను రాహుల్ గాంధీ వ్యతిరేకించకపోతే అప్పుడే అది చట్టంగా మారేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అదే జరిగి ఉండి ఉంటే ఇప్పుడు రాహుల్ పై అనర్హత వేటు అనే అంశమే చర్చకు వచ్చేదికాదని రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. ఒకరకంగా చూస్తే.. ఇప్పుడు తనపై అనర్హత వేటు పడడానికి రాహుల్ గాంధీ 2013లో తనకు తానే రంగం సిద్ధం చేసుకున్నాడని అంటున్నారు.

More Telugu News