ఇప్పుడు వీచింది చిన్న గాలే: చంద్రబాబు

  • టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
  • సైకో పోవాలి సైకిల్ రావాలన్న నినాదం మార్మోగుతోందన్న చంద్రబాబు
  • సజ్జల బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శలు
  • నిన్న వైసీపీకి సొంత ఎమ్మెల్యేలే ఓటు వేయలేదని ఎద్దేవా
Chandrababu Naidu speech after Kotamreddy Joined TDP

నమ్ముకున్నవారిని నట్టేట ముంచేవాడు నాయకుడు కాలేడు అంటూ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించారని, జగన్ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగిరిందని అన్నారు. సైకో పోవాలి... సైకిల్ రావాలనే నినాదం మారుమోగుతోందని తెలిపారు. 

"సజ్జల బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారు. మొన్న చదువుకున్న వాళ్లు తమ పార్టీకి ఓటేయలేదని అన్నాడు. మరి నిన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓటేయలేదు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు రావడాన్ని దేవుడి స్క్రిప్ట్ అని జగన్ ఎద్దేవా చేశాడు. మరి, నిన్న 23వ తేదీన, 23 ఓట్లతో, 2023లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవడం కూడా దేవుడి స్క్రిప్టే! 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఫలితాలు చూశాక, జగన్ కు నిద్రపట్టడంలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగులుతున్నాయని చెప్పుకుంటున్నారు. జగన్ అధికారం ఉందని విర్రవీగాడు. అహంకారంతో ప్రవర్తించాడు. ఇప్పుడు జగన్ పని గాలి తీసిన బెలూన్ లా అయ్యింది.

అధికారంలో ఉన్నవారు హుందాగా, గౌరవంగా ఉండాలి. ప్రజలకు మేలు చేయాలి. అబద్ధాలు, అసత్యాలతో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి  అయ్యాక తొలి రోజు అసెంబ్లీలో మాట్లాడిన జగన్... వేరే పార్టీ నుంచి ఎవరైనా మరో పార్టీలో చేరితే ఆటోమేటిగ్గా వారు డిస్ క్వాలిఫై అయ్యేలా చేయాలన్నాడు. అదేవ్యక్తి టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలని తీసుకున్నాడు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీకి అర్హతే లేదన్నారు. మరి ఇప్పుడు 23 ఓట్లతో టీడీపీ గెలిచింది. 

పట్టభద్రులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు... వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పై తిరగబడ్డారు. ఇప్పుడు వీచింది చిన్నగాలే... భవిష్యత్ లో టీడీపీ సునామీ దెబ్బకు వైసీపీ కొట్టుకుపోతుంది. ఇప్పుడిప్పుడే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. 

ఎవరూ చేయనన్ని తప్పులు సైకో జగన్ చేశాడు. మాట్లాడితే కేసులు... పోలీసులు రాత్రుళ్లు గోడలు దూకి ఇళ్లలోకి వస్తారు. చట్టాన్ని ఉల్లంఘించే పోలీసులుందరి భరతం పడతాం. కొందరు పోలీస్ అధికారులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. సైకో చెప్పింది చేస్తే తమకు కూడా బాగుంటుందని అనుకుంటున్నారు. అలాంటి వారి పేర్లు, వారి చిట్టాలు మొత్తం రెడీ చేశాం. రఘురామిరెడ్డి అనే డీఐజీకి కూడా బుద్ధి చెబుతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం ఉగాది కానుక" అని చంద్రబాబు వివరించారు.

బాణసంచా కాల్చుతూ గాయపడిన కార్యకర్తలు... చంద్రబాబు స్పందన

బాణసంచా కాలుస్తూ గాయపడిన కార్యకర్తలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించాని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలు ఉత్సాహంతో బాణసంచా కాలిస్తే, నలుగురుకి గాయాలయ్యాయని, గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మనకోసం వచ్చినవారికి అలా జరగడం నిజంగా చాలా బాధగా ఉంది అని చంద్రబాబు అన్నారు.
More Telugu News