లోక్ సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు

  • మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష
  • కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడితే అనర్హత వేటు
  • రాహుల్ ఎంపీ సభ్యత్వం చెల్లుబాటు కాదంటూ లోక్ సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు
Rahul Gandhi disqualified as Lok Sabha MP

దేశ రాజకీయాల్లో ఈరోజు కీలక ఘట్టం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. లోక్ సభ సభ్యుడిగా రాహుల్ ను లోక్ సభ సెక్రటరీ జనరల్ అనర్హుడిగా ప్రకటించారు. మోదీ (ఇంటిపేరు) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గుజరాత్ లోని సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కనీసం రెండేళ్ల జైలు శిక్షకు గురైతే వారు అనర్హతకు గురవుతారు. ఈ నిబంధన ప్రకారమే రాహుల్ పై అనర్హత వేటు వేశారు. 

రాహుల్ ని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటరీ జనరల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. వయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సూరత్ కోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. నిన్నటి (మార్చ్ 23) నుంచే అనర్హత అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. 

2019 కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ అనే ఇంటి పేరును ఉద్దేశిస్తూ రాహుల్ విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన కేసును నాలుగేళ్లుగా విచారించిన సూరత్ కోర్టు... రాహుల్ కు జైలు శిక్షను విధిస్తూ నిన్న తీర్పును వెలువరించింది. అయితే అప్పీల్ కు వెళ్లడానికి 30 రోజుల గడువు విధించింది. అయితే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్క రోజు వ్యవధిలోనే లోక్ సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆయన లోక్ సభ సభ్యత్వం చెల్లుబాటు కాదని ప్రకటించింది.

More Telugu News