hindenburg report: హిండెన్ బర్గ్ దెబ్బ.. ఈ సారి జాక్ డోర్సే కంపెనీపై!

  • జాక్ డోర్సేకు చెందిన ‘బ్లాక్‌’ కంపెనీపై హిండెన్ బర్గ్ రిపోర్ట్
  • షేర్ విలువను కృత్రిమంగా పెంచారని.. ఇన్వెస్టర్లను, ప్రభుత్వాన్ని మోసగించారని ఆరోపణ
  • సంస్థ ఖాతాల్లో 40 నుంచి 75 శాతం దాకా నకిలీవేనని వెల్లడి
  • 20 శాతం పైగా పతనమైన బ్లాక్ షేర్లు.. 11 శాతం తగ్గిన జాక్ సంపద
hindenburg report accuses jack dorseys block of 1bn dollar fraud misleading investors

హిండెన్ బర్గ్ దెబ్బకు అదానీ గ్రూప్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీల షేర్లు ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు మరో కంపెనీని హిండెన్ బర్గ్ టార్గెట్ చేసింది. ఈ సారి ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేకు చెందిన పేమెంట్స్ కంపెనీ, మొబైల్ బ్యాంకింగ్ సంస్థ ‘బ్లాక్‌’ను దెబ్బకొట్టింది.

‘‘త్వరలోనే కొత్త నివేదిక - మరో బిగ్ వన్ పై’’ అంటూ నిన్న హిండెన్ బర్గ్ ట్వీట్ చేసింది. తర్వాత  ‘బ్లాక్’ కంపెనీ నిర్వాహకులు పెద్ద ఎత్తున అక్రమాలు చేశారంటూ సంచలన నివేదిక బయటపెట్టింది. ఈ రిపోర్ట్‌ను రెండేళ్లకుపైగా పరిశోధన చేసి రూపొందించినట్లు వివరించింది.

ఖాతాదారుల సంఖ్య ఎక్కువగా చూపుతూ, షేర్ విలువను కృత్రిమంగా పెంచుతూ బ్లాక్ మేనేజ్‌మెంట్ ఇన్వెస్టర్లను, ప్రభుత్వాన్ని మోసగించినట్లు హిండెన్‌బర్గ్ చెప్పింది. నిబంధనలను అతిక్రమిస్తూ.. రుణాల పేరుతో దోపిడీ చేస్తోందని ఆరోపించింది. బ్లాక్ లోని ఖాతాల్లో 40 నుంచి 75 శాతం దాకా నకిలీవేనని సంస్థ మాజీ ఉద్యోగులు చెప్పినట్లు హిండెన్ బర్గ్ తెలిపింది.

హిండెన్ బర్గ్ నివేదిక వెలువడిన వెంటనే బ్లాక్ షేర్లు పెద్ద ఎత్తున పతనమయ్యాయి. ఒక్కరోజే 22 శాతం వరకు పడిపోయాయి. తర్వాత కాస్త కోలుకున్నా.. ప్రస్తుతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం గురువారం ఒక్కరోజే జాక్ డోర్సే వ్యక్తిగత సంపద 526 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.4 వేల కోట్లకుపైనే) ఆవిరైంది. గతేడాది మే నుంచి ఇప్పటిదాకా ఒకే రోజులో ఈయన అత్యధిక సంపద పతనం కావడం ఇదే తొలిసారి.

జాక్ సంపద 11 శాతం తగ్గి 4.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. జాక్ సంపద ఎక్కువగా బ్లాక్ కంపెనీలోనే ఉంది. ఇందులో 3 బిలియన్ డాలర్ల షేర్లు ఉండగా.. ట్విట్టర్ లో 388 మిలియన్ డాలర్ల షేర్లు ఉన్నాయి. బ్లాక్ సంస్థ ఫౌండర్లతో పాటు ముఖ్య ఆర్థిక అధికారి అమృతా అహుజా, మేనేజర్ బ్రెయిన్ కూడా షేర్లలో మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించింది.

More Telugu News