Health: వెన్ను నొప్పి బాధిస్తుంటే ఇలా చేసి చూడండి..!

  • కూర్చునే పద్ధతి సక్రమంగా ఉండాలంటున్న నిపుణులు
  • బలహీనమైన కండరాల వల్ల వెన్నుపై భారం
  • వ్యాయామంతో కండరాలకు బలం చేకూరుతుందని వెల్లడి
  • మసాజ్, ఐస్ ప్యాక్, గోరువెచ్చటి నీటితో స్నానం తదితర చిట్కాలతో ఉపశమనం
Cannot cope with back pain but these kitchen tips dont work with the doctor

ఈ రోజుల్లో వెన్ను నొప్పితో ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వెన్నెముక కండరాలు బలహీనంగా మారడం, కండరాలపై ఒత్తిడి, వయసుతో పాటు శరీరంలో వచ్చే మార్పుల వల్ల వెన్ను నొప్పి బాధిస్తుందని వైద్యారోగ్య నిపుణులు చెబుతున్నారు. ముందుకు వంగడం, ఎక్కువసేపు కూర్చోలేకపోవడం తదితర సమస్యలతో బాధపడుతుంటే వంటింటి చిట్కాలతో కొంత ఉపశమనం పొందవచ్చని వివరించారు. ఈ సూచనలు తాత్కాలిక ఉపశమనం కోసమేనని, దీర్ఘకాలంపాటు వెన్ను నొప్పి బాధిస్తుంటే వైద్యులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.

  • వెన్ను నొప్పి తీవ్రంగా ఉంటే ఐస్ ప్యాక్ తో కొంత ఉపశమనం పొందవచ్చు. ఓ టవల్ లో ఐస్ ను తీసుకుని వీపుకు చుట్టుకుంటే వాపును, నొప్పిని తగ్గిస్తుంది. రోజులో ఒకటి, రెండుసార్లు ఇలా చేయొచ్చని నిపుణులు సూచించారు.
  • ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారిని తరచూ వెన్ను నొప్పి బాధిస్తుంది. కూర్చునే పద్ధతి సరిగా లేకపోవడం వల్ల వీపుపై ఒత్తిడి పెరిగి వెన్ను నొప్పికి కారణమవుతుంది. అందుకే కూర్చునేటపుడు వీపు భాగంలోని ఎముకలు సమంగా, పాదాలు నేలపై చదునుగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వీపుపై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు వివరించారు.
  • మసాజ్ ద్వారా వెన్ను నొప్పిని వదిలించుకోవచ్చు. జండూబామ్, అమృతాంజనం వంటి పెయిన్ రిలీఫ్ బామ్ లతో మసాజ్ వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది. 
  • వెల్లుల్లి నూనెతో వీపును సున్నితంగా మసాజ్ చేసి, కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే రిలీఫ్ గా ఉంటుంది.
  • కండరాల ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
  • పాలలో పసుపు తేనె కలుపుకుని తాగడం ద్వారా వెన్ను నొప్పితో పాటు కీళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయని సూచిస్తున్నారు

More Telugu News