మంచు విష్ణు, మంచు మనోజ్ ల గొడవపై మోహన్ బాబు ఆగ్రహం

  • సారధి అనే వ్యక్తిపై దాడి చేసిన మంచు విష్ణు
  • వీడియో షేర్ చేసిన మనోజ్
  • సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నానన్న మోహన్ బాబు
Mohan Babu anger on Manchu Vishnu and Manchu Manoj issue

మంచు వారి కుటుంబ విభేదాలు రచ్చకెక్కాయి. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ లకు పడటం లేదని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మంచు మనోజ్, భూమా మౌనికల వివాహానికి కూడా మంచు విష్ణు ఏదో గెస్టులా వచ్చి వెళ్లిపోయారు. తాజాగా మంచు విష్ణుకు సంబంధించిన ఓ వీడియోను మనోజ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి కలకలం రేపారు. ఇలా ఇళ్లలోకి దూరి మా వాళ్లను, బంధువులను కొడుతుంటాడండీ... ఇదీ సిచ్యువేషన్ అని మనోజ్ అన్నారు. ఈ వీడియో కలకలం రేపింది. 

మరోవైపు ఈ అంశంపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాకు ఎందుకు ఎక్కారని ప్రశ్నించినట్టు సమాచారం. తన తండ్రి ఆదేశాలతో మనోజ్ వీడియోను డిలీట్ చేశారు. ఓ వీడియో ఛానల్ తో మోహన్ బాబు మాట్లాడుతూ... అన్నదమ్ముల మధ్య చిన్నచిన్న గొడవలు జరగడం సహజమేనని చెప్పారు. ఆవేశం అన్ని విధాలా అనర్థమేనని అన్నారు. ఇద్దరి మధ్య సర్ది చెప్పేందుకు యత్నిస్తున్నానని తెలిపారు. 

ఇంకోవైపు ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని మనోజ్ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు, కాసేపటి క్రితం మంచు లక్ష్మి తన నివాసం నుంచి కారులో బయల్దేరారు. ఆమె ఎక్కడకు బయల్దేరారనే విషయంలో క్లారిటీ లేదు.

నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఈ గొడవ జరిగినట్టు భావిస్తున్నారు. మోహన్ బాబుకు బంధువైన సారథి అనే వ్యక్తిపై విష్ణు దాడి చేసినట్టు చెపుతున్నారు. ఆ సమయంలో సారధి ఇంట్లో మనోజ్, మంచు లక్ష్మి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోను తీసింది కూడా మనోజే అని భావిస్తున్నారు.

More Telugu News