ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. కోర్టులోనే ముఖంపై యాసిడ్ పోసిన భర్త

  • తమిళనాడులోని కోయంబత్తూరులో ఘటన
  • కేసు విచారణకు కోర్టుకు వస్తుందని ముందే ఊహించిన భర్త
  • యాసిడ్ బాటిల్‌తో వచ్చి ముఖంపై దాడి
  • 80 శాతం గాయాలు.. నిందితుడి అరెస్ట్
Husband attacked wife with acid in court in Tamil Nadu

ప్రియుడితో వెళ్లిపోయిన భార్యపై పగ పెంచుకున్న భర్త కోర్టు హాలులోనే ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. లారీ డ్రైవర్ అయిన శివకుమార్, బాధిత మహిళ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ ఆమెపై పగ పెంచుకున్నాడు. 

మరోవైపు, 2016లో ఓ చోరీ కేసులో అరెస్ట్ అయిన సదరు మహిళ ప్రస్తుతం బెయిలుపై బయట ఉంది. కేసు విచారణలో భాగంగా నిన్న ఆమె కోర్టుకు వచ్చింది. ఆమె వస్తుందని ముందే ఊహించిన శివకుమార్ పథకం ప్రకారం వెంట యాసిడ్ బాటిల్ తెచ్చుకున్నాడు. ఆమె రాగానే బాటిల్‌లోని యాసిడ్‌తో ఆమెపై దాడిచేశాడు. ముఖంపై యాసిడ్ పడడంతో ఆమె నొప్పితో విలవిల్లాడుతూ అక్కడే కుప్పకూలిపోయింది. అక్కడున్నవారు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో ఆమెకు 80 శాతం గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. యాసిడ్ దాడి అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News