Rohit Sharma: వరుసగా మూడు గోల్డెన్ డక్ లు.. సూర్యకు రోహిత్ మద్దతు!

  • మూడు మ్యాచ్ లలో మూడే బంతులు ఆడటం దురదృష్టకరమన్న రోహిత్
  • అద్భుతమైన బంతులకు సూర్య ఔటయ్యాడని వ్యాఖ్య
  • అతడు తిరిగి పుంజుకుంటాటని వెల్లడి
Rohit Sharmas Honest Take On Suryakumar Yadav

మొన్నటి దాకా టీ20ల్లో చెలరేగిన టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం వరుసగా నిరుత్సాహపరుస్తున్నాడు. వరుసగా మూడు మ్యాచ్ లలో గోల్డెన్ డక్ గా ఔట్ అయ్యాడు. మూడు మ్యాచ్ లకు కలిపి మూడే బంతులు ఆడి.. ఔట్ అయ్యి ఎవ్వరూ కోరుకోని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. నెట్టింట తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

ఈ నేపథ్యంలో సూర్య వైఫల్యంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. మూడు వన్డేల సిరీస్‌లో కేవలం మూడు బంతులు మాత్రమే ఆడటం దురదృష్టకరమని చెప్పాడు. అద్భుతమైన బంతులకు సూర్య ఔటయ్యాడని వెనకేసుకొచ్చాడు. 

‘‘ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ మూడు బంతులు మాత్రమే ఆడాడు. దాన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావడం లేదు. కానీ అతను మూడు అద్భుతమైన బంతులకు ఔటయ్యాడనేది వాస్తవం. మూడో వన్డేలో అతను ఎదుర్కొన్న బంతి నా దృష్టిలో గొప్పది కాదు. కానీ అతను తప్పుడు షాట్ ఎంచుకున్నాడు’’ అని వివరించాడు. 

‘‘స్పిన్ ను సూర్య బాగా ఆడగలడు. చాలా ఏళ్లుగా అతడి ఆటను చూస్తున్నాం. అందుకే లోయర్ ఆర్డర్ లో పంపించాం. చివరి 15-20 ఓవర్లు ఆడతాడని భావించాం. కానీ తొలి బంతికే ఔట్ అవ్వడం దురదృష్టకరం. అలా ఎవరికైనా జరుగుతుంది. అంత మాత్రాన అతని సత్తా తగ్గినట్లు కాదు’’ అని చెప్పుకొచ్చాడు. సూర్య తిరిగి పుంజుకుంటాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.

More Telugu News