Bollaram: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ఏడాదంతా చూడొచ్చు !

Bollaram Rashtrapati Bhavan visiting times changed
  • బొల్లారంలోని రాష్ట్రపతి విడిది సందర్శనలో మార్పులు
  • గతంలో ఏటా 15 రోజులే సందర్శకులకు అనుమతి
  • ఈ నెల 23 నుంచి విజిటర్లను స్వాగతిస్తున్న అధికారులు
రాష్ట్రపతి దక్షిణాది విడిదిగా పేరొందిన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం తలుపులు సందర్శకుల కోసం తెరుచుకున్నాయి. గతంలో ఏటా పదిహేను రోజుల పాటు మాత్రమే రాష్ట్రపతి నిలయం సందర్శనకు అధికారులు అనుమతినిచ్చేవారు. ప్రస్తుతం ఏడాదంతా సందర్శకులకు స్వాగతం పలకనున్నారు. ప్రతీ సోమవారంతో పాటు సెలవు రోజుల్లో మినహా ఏడాదిలో ఏ రోజైనా సరే బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని చూడొచ్చని అధికారులు తెలిపారు. ఈమేరకు సందర్శన సమయాలలో మార్పులు చేసిన తర్వాత బుధవారం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము లాంఛనంగా ఈ సందర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శకుల కోసం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఆహ్లాదంతో పాటు స్వాతంత్ర్యవీరుల త్యాగాలను నేటి తరానికి తెలియజేప్పేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అనంతరం రాష్ట్రపతి నిలయంలో తలపెట్టిన జైహింద్ ర్యాంప్, జాతీయ పతాక పునర్నిర్మాణ పనులకు ముర్ము శంకుస్థాపన చేశారు. రాష్ట్రపతి నిలయంలో ఆర్ట్ గ్యాలరీ, కోర్ట్ యార్డ్ ప్రాంతాలను అధికారులు ఆధునికీకరించారు. విజిట్ రాష్ట్రపతి భవన్ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ గేటు దగ్గర కూడా టికెట్లు అమ్ముతారని తెలిపారు. భారతీయులకు ఒక్కొక్కరికీ రూ.50, విదేశీయులకు రూ.250 గా టికెట్ ధర నిర్ణయించారు.
Bollaram
Rashtrapati bhavan
visitors
Rashtrapati nilayam

More Telugu News