Tourists: గుడ్ న్యూస్.. టూరిస్ట్ వీసాపై యూఎస్ వెళ్లి ఉద్యోగం వెతుక్కోవచ్చు!

  • దీన్ని నిర్ధారించిన యూఎస్ సీఐఎస్
  • బీ1, బీ2 వీసాదారులకు సువర్ణ అవకాశం
  • ఉద్యోగం లభిస్తే స్టేటస్ మార్పునకు దరఖాస్తు చేసుకోవాలని సూచన
  • ఉద్యోగం కోల్పోయి, మరో ఆఫర్ లేని వారు వెళ్లిపోవాల్సిందేనని స్పష్టీకరణ
Tourists can apply for jobs while on temporary visa in US Details

అమెరికాలో ఉద్యోగం చేయాలన్నది చాలా మంది భారతీయ యువతకు ఉండే కల. అయితే, నకిలీల బారిన పడకుండా దీని కోసం రాచమార్గంలో అమెరికాకు రావచ్చని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) ప్రకటించింది.  


బిజినెస్ లేదా టూరిస్ట్ వీసాపై అమెరికాకు వచ్చి ఉద్యోగం వెతుక్కోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని పేర్కొంది. బీ1, బీ2 వీసాదారులకు ఈ అవకాశం కల్పించింది. ఇలా బీజినెస్, టూరిస్ట్ వీసాపై వచ్చే వారు అమెరికాలో ఉద్యోగం పొందినట్టయితే.. తమ వీసా స్టేటస్ ను మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైన నాన్ ఇమిగ్రెంట్ వర్కర్ లు (వలసేతర కార్మికులు) 60 రోజుల్లోపు దేశం వీడిపోవడం మినహా మరో ఆప్షన్ లేదని తప్పుగా అర్థం చేసుకున్నట్టు యూఎస్ సీఐఎస్ పేర్కొంది. ఉపాధి రద్దు అయిన నాటి నుంచి ఈ 60 రోజుల కాల పరిమితి వర్తిస్తుందని.. ఒకవేళ అర్హత ఉంటే వారు యూఎస్ లోనే అప్పటి వరకు ఉండొచ్చని తెలిపింది. ఈ కాలంలో నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ ను మార్చాలంటూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. కొత్త ఉద్యోగం సంపాదించుకోవచ్చని పేర్కొంది. ఉద్యోగ ధ్రువీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. 60 రోజుల గ్రేస్ పీరియడ్ లో వీటికి దరఖాస్తు చేసుకుని, అర్హత ఉన్న వారు 60 రోజులు దాటిన తర్వాత కూడా యూఎస్ లో కొనసాగొచ్చని స్పష్టం చేసింది. 

ఉపాధిని కోల్పోయి, యూఎస్ సీఐఎస్ సూచించిన వాటిల్లో దేనినీ అమలు చేయని వారు, తమపై ఆధారపడిన వారితో పాటు 60 రోజులు ముగిసేలోగా అమెరికాను వీడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే, స్టేటస్ మార్పునకు, నూతన ఉపాధి కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైనా సరే వారు అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని పేర్కొంది. 

More Telugu News