YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు

  • గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్
  • ఈరోజు విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు
  • ఈనెల 29వ తేదీకి కేసు వాయిదా
telangana high court issues notice to erragangireddy in viveka murder case

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు విచారించింది. గంగిరెడ్డికి నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని 2019 మార్చి 28న సిట్ అధికారులు అరెస్టు చేశారు. 90 రోజుల్లో సిట్ చార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 2021 అక్టోబరులో గంగిరెడ్డిపై సీబీఐ చార్జ్‌షీట్ ఫైల్ చేసింది. అతడికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టును కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది.

దీంతో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గంగిరెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. అయితే అప్పటికే వివేకా కేసు హైదరాబాద్‌ కు బదిలీ కావడంతో.. తెలంగాణ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఎర్రగంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది.

More Telugu News